ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ఈ నెలలో  అమలు చేయనున్న ప్రభుత్వ పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. 


ఆగస్టు 10వ తేదీన అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ చెల్లింపులను మంత్రి వర్గ భేటీలో ఆమోదించే అవకాశం ఉంది. రూ.10 లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకాలపై మంత్రి వర్గంలో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.


కేబినేట్ సమావేశంలో రహదారులు భవనాల శాఖకు చెందిన ఆస్తుల బదలాయింపు సహా మరిన్ని కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రహదారులు భవనాల శాఖకు చెందిన రూ. 4 వేల కోట్ల ఆస్తులను రహదారుల డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు బదలాయించే విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, కేంద్రం సహకారంతో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక కారిడార్‌లకు, పోర్టులకు అనుసంధానంగా ఈ లాజిస్టిక్ పార్కులను ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. 


నిధుల సమీకరణకు నూతన కార్పొరేషన్!


రాష్ట్రంలో నిధుల సమీకరణకు సంబంధించి నూతన కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గంలో ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో నూతన సీడ్ పాలసీ అమలుపై చర్చించనున్నారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో ఏవిధంగా అమలు చేయాలనే అంశంపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. నేతన్న నేస్తం, పాఠశాలల్లో నాడు- నేడు పనులకు ఆమోదం తెలిపి అవకాశం ఉంది. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్ అండ్ ఆర్ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు అదనంగా ఇచ్చే అంశంపైనా ఈ సమావేశంలో  చర్చించనున్నారు. ఆక్వా రైతులకు లాభం కలిగేలా ఫిష్ మార్కెటింగ్ విధానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 


Also Read: Land Survey, Andhra Pradesh: సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు.. వందేళ్ల తర్వాత తొలిసారి