Somu Veerraju : ఏపీలో పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏ ఏ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలతో కలిసి పోటీ చేస్తాయని అటు ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న తరుణంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మాట్లాడిన సోము వీర్రాజు...అధికారం కోసం హత్యా రాజకీయాలను చేస్తున్న రాక్షస ప్రభుత్వం ఏపీలో ఉందని తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనేదే బీజేపీ లక్ష్యమన్నారు. ఏపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సోము వీర్రాజు ప్రకటించారు. గతంలో జగన్‌ పాదయాత్ర చేయలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు ఎమర్జెన్సీని తలపించేలా జీవో ఎందుకని ప్రశ్నించారు. 






పొత్తులపై స్పందిస్తూ 


జీవో నెం. 1కి వ్యతిరేకంగా చలో తిరుపతికి పిలుపు ఇస్తామని సోము వీర్రాజు తెలిపారు. వైసీపీ  ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటిని అవినీతిమయం చేస్తోందని ఆరోపించారు. కుటుంబ, అవినీతి రాజకీయాలను నాశనం చేయాలనే బీజేపీ లక్ష్యం అని తెలిపారు. సంక్షేమం పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలుచేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బటన్ నొక్కి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా ఒక్క బీజీపీకే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పొత్తులపై సోము వీర్రాజు స్పందిస్తూ... ఏపీలోని 3 కోట్ల ప్రజలతోనే బీజేపీకి పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 


పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు


కొండగట్టు అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ పడేనాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు. పార్టీ ప్రచార రథం వారాహి వెహికల్‌కు ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన... కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ అంటోందన్న ప్రచారంపై కూడా ఇలానే స్పందించారు పవన్.  తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్‌ కల్యాణ్‌. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్‌ ఏర్పాటును స్వాగతించిన పవన్ కల్యాణ్... మార్పు ఆహ్వానించదగిందే అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరమైన నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే తప్ప దావోస్‌లాంటి పర్యటనలు ప్రయోజనాలు ఇవ్వబోమన్నారు పవన్. గతంలో ఏపీ ప్రభుత్వ నేతలు వెళ్లిన తర్వాత.. ఆ ఊపును కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.