BBC Documentary: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని యూట్యూబ్, ట్విట్టర్ నుంచి తొలగించగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఈ డాక్యుమెంటరీని చూపించినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కూడా అధికారులకు ఫిర్యాదు చేసింది. క్యాంపస్‌లో విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని చూశారని ఆరోపించింది. అదే సమయంలో దీన్నిఢిల్లీలోని జేఎన్‌యులో కూడా ప్రదర్శించాల్సి ఉందని.. కానీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హెచ్సీయూలో డాక్యుమెంటరీ ప్రదర్శనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యూనివర్శిటీ క్యాంపస్‌లో బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా: ది మోడీ క్వశ్చన్" ను ప్రదర్శించారని.. దీని విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇదే కాకుండా.. జేఎన్యూలో విద్యార్థుల బృందం ఇవాళ(జనవరి 24న తేదీన) ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నట్లు తెలిసిందని సమాచారం వచ్చినట్లు వివరించారు. ఇలాంటి డాక్యుమెంటరీ క్యాంపస్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ప్రదర్శన కోసం కరపత్రాల పంపిణీ..
జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇది మాత్రమే కాదు విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ కూడా ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికంగా తన స్నేహితులతో పంచుకున్నారు. ఈ పోస్టు వైరల్ కావడంతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ అధికారులు ప్రదర్శనను రద్దు చేశారు.
గుజరాత్ అల్లర్ల ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ..
నిజానికి 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీ, కేంద్రం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. అందుకే తీవ్ర వివాదంగా మారుతోంది. కేంద్రం నుంచి ఫిర్యాదులు రావడంతో యూట్యూబ్, ట్విట్టర్‌లలో ఈ డాక్యుమెటరీని బ్లాక్ చేశారు. అయినప్పటికీ.. ఇది మళ్లీ నెట్టింట దర్శనం ఇస్తూనే ఉంది. వీటి గురించి బీబీసీ ఓ సిరీస్ ను సిద్ధం చేసింది. ఇందులోని మొదటి భాగాన్ని గతంలోనే రిలీజ్ చేశారు.