Andhra Pradesh Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలతో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ క్రతువు పూర్తయింది. 6 గంటలకు ఇంకా క్యూలో నిలబడ్డ వారికి మాత్రం ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు. దాదాపు 70 శాతం పోలింగ్ శాతం నమోదైనట్లుగా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే క్యూలో ఉన్న ఓటర్ల ఓట్లు కూడా పోలైన తర్వాత కచ్చితమైన ఓటింగ్ శాతాన్ని ఈసీ రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థుల భవితవ్యం మొత్తం ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. వాటిని ప్రత్యేక నిబంధనల మధ్య సీల్ చేసి.. ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు.


ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల వేళ శాంతి భద్రతలు కాపాడడం కోసం 1.06 లక్షల మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. అయినప్పటికీ సమస్యాత్మక నియోజకవర్గాలు సహా చాలా చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.


ఏపీలో మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసిపోయింది. అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరిగింది.


ఏపీలో వివిధ పార్టీలు ఇలా
ఏపీలో ప్రధానంగా ఉన్న పార్టీలు వైఎస్ఆర్ సీపీ, టీడీపీ, జనసేనతో పాటు అంతగా ప్రాబల్యం లేని బీజేపీ, కాంగ్రెస్ లు కూడా బరిలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీ మాత్రం బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా బరిలోకి దిగింది. వైఎస్ఆర్ సీపీ 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ సీట్లు.. బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్ సభ స్థానాలు దక్కాయి. టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేస్తోంది.


ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
 ఏపీ ఎన్నికలు ఉదయం నుంచి మొదలుకాగానే ఎక్కడో ఒక హింసాత్మక ఘటన జరుగుతూనే ఉంది. పోలింగ్ లో ఘర్షణలు తలెత్తి, వైసీపీ, జనసేన, టీడీపీల నేతలు కలబడి కొట్టుకోవడం, రాళ్లు విసరురుకోవడం వంటి ఘటనలు జరిగాయి. తాడిపత్రి లాంటి చోట్ల ఏకంగా ఎస్పీ వాహనంపైనే దుండగులు  రాళ్లతో దాడి చేశారు. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతూనే పల్నాడు జిల్లాలో మొదలైన ఉద్రిక్తతలు వెంటవెంటనే వివిధ చోట్ల కూడా వెలుగులోకి వచ్చాయి. రెంటచింతల మండలం రెంటాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడికి దిగగా.. ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. 


టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్
చిత్తూరు జిల్లా పీలేరులో ముగ్గురు టీడీపీ ఏజెంట్ల కిడ్నాప్ చేశారని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో కొందరు ఈవీఎంలు పగలగొట్టారు. పోలింగ్ నిలిచిపోగా.. తమ పోలింగ్ ఏజెంట్ ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హిందూపురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు కాగా, 2 కార్లు ధ్వంసం అయ్యాయి.


తెనాలిలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా తెనాలిలో తీవ్రమైన ఘటన జరిగింది. ఎమ్మెల్యే శివకుమార్ క్యూలైన్ లో నిలబడకుండా నేరుగా వెళ్లడంపై ఓ ఓటరు అభ్యంతరం తెలిపారు. లైన్ లో నిలబడాల్సిందిగా కోరారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఓటరును చెంపపై కొట్టారు. వెంటనే ప్రతిఘటించిన ఓటరు ఎమ్మెల్యే చెంప కూడా చెళ్లుమనిపించారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడగా.. 3 వాహనాలు ధ్వంసం అయ్యాయి.


దొంగ ఓట్లు
తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రంలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. శ్రీకాళహస్తికి చెందిన 24 ఓటర్లు దొంగ ఓట్లు వేయడానికి వచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగఓట్లు కలకలం సృష్టించాయి. విద్యానగర్ లో దొంగ ఓట్లు వేస్తున్నారని.. మంత్రి రజినికి ఏజెంట్ సమాచారం ఇవ్వగా.. ఆమె పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రం బయట అధికంగా ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.


మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసం కాగా.. పలు చోట్ల పోలింగ్ నిలిచిపోయింది. గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గీయుల మధ్య తోపులాట జరిగి.. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు.


తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య  ఘర్షణ నెలకొంది. చిల్లకూరు జిల్లా పరిషత్ పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అభ్యర్థి మురళి, టీడీపీ అభ్యర్థి సునీల్ మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంకా పల్నాడు జిల్లా దొడ్లేరు, కాకినాడ, పోరంకి తదితర చోట్ల 


చంద్రబాబు లేఖ
ఏపీలో జరిగిన అనేకమైన ఉద్రిక్తతలు జరిగాయని సాయంత్రం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు పోలింగ్ జరిగిన ఒకేరోజు 120కి పైగా హింసాత్మక ఘటనలు జరిగాయని అన్నారు. అన్ని చోట్లా వైసీపీ నేతలు హింసకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని కోరారు.