ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల నుంచి దాదాపు రూ.21,500 కోట్ల రుణం తీసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీలు పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణరెడ్డి, జాతీయ కార్యదర్శి సునీల్ ధియోధర్, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి రమేష్ నాయుడు మంగళవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఫిర్యాదులో ఏముందంటే….
రెండేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. పింఛన్లు, జీతాలనూ సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. ఆచరణ సాధ్యంకాని పథకాలను అమలు చేయడానికి ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను తుంగలోతొక్కి రాష్ట్రం అప్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకుల కన్సార్షియం నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.13,500 కోట్ల రుణం ఇప్పిస్తోంది. ఇందుకోసం గత ఏడాది నవంబరు 5న ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాల మధ్య ఎస్క్రో ఖాతా తెరిచారు. వివిధ బ్యాంకుల నుంచి అదనంగా రూ.కోట్ల రుణం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మొత్తం కలిపితే రుణం రూ.21,500 కోట్లకు చేరుతుంది. ఇందుకు భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని పూచీకత్తుగా పెట్టారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తు పన్నులను ఎస్క్రోలో జమ చేస్తామని చెబుతోంది. దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వరంగ బ్యాంకులు రుణాలను ఎలా ఇస్తున్నాయన్నది అంతుబట్టడం లేదు. ప్రైవేటురంగ బ్యాంకులు తప్పుకున్న చోట ప్రభుత్వరంగ బ్యాంకులు అడుగుపెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పద్ధతిలో భారీ రుణాలు తీసుకొని పంపిణీ చేస్తారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని గంభీరంగా తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపించాలి’ అని నిర్మలా సీతారామన్ ను కోరారు ఏపీ బీజేపీ నేతలు.
టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడంలేదు
మరోవైపు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం పూర్తి చేసుకున్న 2.6 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని సోమువీర్రాజు బృందం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీకి ఫిర్యాదు చేసింది. ఇళ్లపై సమీక్ష నిర్వహించి, లబ్ధిదారులకు అందించాలని విన్నవించింది.
కేంద్రం అప్పులపై మాట్లాడే హక్కులేదు: సోము వీర్రాజు
ఏపీ చేస్తున్న అప్పులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం అప్పులపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు ప్రభుత్వం ఉల్లంఘించిందని కేంద్రానికి తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రం చేరుకుందని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు సోము వీర్రాజు వివరించారు.