Visakha Fishing Harbor Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్ (Visakha Fishing harbor) ప్రమాదానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా, ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఈ నెల 19న 10:48 గంటలకు హడావుడిగా ఇద్దరు వ్యక్తులు రావడం గుర్తించారు. ఆ తర్వాత 2 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అగ్ని ప్రమాద ప్రారంభ దశలో ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ ఇద్దరు ఎవరు.? ప్రమాదానికి ముందు హార్బర్ లో ఏం చేస్తున్నారు.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఓ బోటులో ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందని వారు చెప్పినట్లు సమాచారం. సీసీ ఫుటేజీ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదంలో 40 బోట్లు దగ్ధం కాగా, 9 బోట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.


'ఉప్పుచేపే కారణమా.?'


'ఫిషింగ్ హార్బర్ లోని బోటులో ఆ రోజు రాత్రి ఉప్పు చేప వేపుతుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది చేసింది నానికి బంధువే. అతనికి వరుసకు మామ అయ్యే వ్యక్తి మందులో మంచింగ్ కోసం ఉప్పు చేప వేపాడు. ఆ సమయంలోనే మంటలు చెలరేగాయి. కొద్ది రోజుల క్రితం అదే బోటులో అతను పని చేశాడు.' అని 8 మంది అనుమానితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు.


హైకోర్టులో నాని పిటిషన్


మరోవైపు, ఈ కేసులో పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న యూట్యూబర్‌, లోకల్‌బాయ్‌ నాని హైకోర్టును ఆశ్రయించాడు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను 3 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.  ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. 


'నేను ఏ తప్పూ చేయలేదు'


విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో తాను ఏ తప్పూ చేయలేదని యూట్యూబర్ నాని స్పష్టం చేశాడు. 'వేరే ప్రాంతంలో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగలబడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి. నేను అప్పటికే మద్యం తాగే ఉన్నాను. నేను హార్బర్ కు వెళ్లేదంతా సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. అయితే, ఫిషింగ్‌ హార్బర్‌లో ప్రమాదాన్ని వీడియో తీయటం ద్వారా ప్రభుత్వానికి విషయం చెప్పటానికి మాత్రమే నేను ప్రయత్నం చేశాను. కానీ, వీడియోలు తీస్తున్న నన్ను కొందరు కొట్టే ప్రయత్నం చేశారు. వీడియో తీసిన తర్వాత నేను కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నా. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాను.' అని వివరించాడు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


Also Read: SI Recruitment: ఎస్ఐ పోస్టుల భర్తీలో కీలక పరిణామం - కోర్టులోనే 'ఎత్తు' కొలవండి, హైకోర్టు ఆదేశం