Chandrababu Letter to State Election Commissioner: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి (State Election Commissioner) లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని, ఎలక్టోరల్ మాన్యువల్ ప్రకారం ఓటర్ల జాబితాలో మార్పులు జరగడం లేదని ఆరోపించారు. 'ఓటర్ల జాబితాను పూర్తిగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి. ఇప్పటికే డబుల్ ఎంట్రీలు గుర్తిస్తున్నారు. మరణించిన వారి ఓట్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయి. అధికార పార్టీ నేతలు ఆన్ లైన్ లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. మేము లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పటికీ దృష్టి పెట్టలేదు. ఓట్లను తొలగించాలంటే కచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఎలాంటి విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఓట్లను తొలగిస్తున్నారు. ఓట్ల అవకతవకల విషయంలో ఈసీ ప్రత్యేక దృష్టి సారించాలి. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలి.' అని లేఖలో పేర్కొన్నారు.


'అభ్యంతరాలపై చర్యలేవీ.?'


రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ 1960 ప్రకారం ఓట్లను ఇంటి నెంబర్ల ప్రకారం ఉండేలా చూడాలని, కానీ నేటీకీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఇష్టానుసారంగా ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారని ఈసీ దృష్టికి తెచ్చారు. ఓటుపై అభ్యంతరాలు లేవనెత్తి ఓట్లను తొలగించాలని కోరుతున్న వారు కచ్చితంగా ఆధారాలు చూపించాలన్నారు. అయితే, కొన్ని నియోజకవర్గాల్లో ఎలాంటి విచారణ చేయకుండానే తెల్ల పేపర్ పై పేర్లు రాసిస్తే ఓట్లను తొలగిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఓట్ల మార్పులు, చేర్పులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక రివిజన్ సమ్మరీ సందర్భంగా చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకటించి నెల రోజులవుతున్నా తమ అభ్యంతరాలపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వీటన్నింటిపైనా దృష్టి సారించాలని, ఓట్లలో అవకతవకలు లేకుండా చూడాలని చంద్రబాబు సీఈవోను లేఖలో కోరారు.


Also Read: Chandrababu Case : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా - మళ్లీ ఎప్పుడంటే ?