ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా... ఈ అంశంలో అధికారికంగా స్పందించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వేసిన ప్రశ్నకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో అనుమతించిన దాని కంటే.. రూ.4,872 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు, మున్సిపల్ పన్నుల పెంపు సహా అనేక సంస్కరణలు అమలు చేయడం వల్ల కల్పించిన అదనపు రుణ సౌకర్యంతో కలిపి.. మొత్తం రూ.49,497 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు కలిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్పు రూ.54,369 కోట్లు అప్పు తీసుకుందని తెలిపారు.
ఆఫ్ బడ్జెట్ రుణాలపై కేంద్రానికి తెలియని లెక్కలు..!
అయితే పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఇచ్చిన సమాచారం కన్నా ఎక్కువగా ఏపీ అప్పులు చేసిందనే ఆరోపణలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. లెక్కల్లోకి రాకుండా అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుల లెక్కల్లోకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రావు. అంటే.. కార్పొరేషన్ల పేరుతో.. ఇతర వాటితో తీసుకునే రుణాలు... ఏపీ సర్కార్ గ్యారంటీల ద్వారా తెచ్చే రుణాలు ఉంటాయి. వాటిని డైరక్ట్ ప్రభుత్వ అప్పులుగా చెప్పరు. అలాంటివే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మెడికల్ కార్పొరేషన్ వంటి వి ఏర్పాటు చేసి.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కళ్లుగప్పేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను తేవడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం వంటివి చేస్తోంది. 2020-21 రాబడుల ప్రకారం గ్యారంటీలు ఇచ్చేందుకు గరిష్ట పరిమితి రూ. 1,06,200కోట్లు కాగా, మార్చి 2021నాటికి ఇచ్చిన గ్యారంటీలు బడ్జెట్ లో చెప్పినవే రూ. 91,330కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ. 21,500కోట్ల గ్యారంటీ ఇచ్చి రూ. 18,500కోట్లు రుణం తీసుకుంది. ఇది ఆ ఖాతాలో వేయలేదు. అయితే.. తాము గ్యారంటీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా రుణపరిమితి తగ్గింపు..!
అయితే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కాకుండా.. ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,472 కోట్లు రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఏపీ చేసిన అప్పుల లెక్కలను తీసుకున్న కేంద్రం...రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా తేల్చింది. కోత వేసిన రుణపరిమితి మేరకు ఇప్పటికే ఏపీ అప్పు చేసిందని కేంద్రం గుర్తించింది. ఈ రెండింటి మధ్య తేడా కేంద్రం.. లోక్‌సభకు ఇచ్చిన సమాచారం కంటే ఎక్కువ ఉంది. అంటే కేంద్రం వద్ద ఏపీ అప్పులపై ఇంకా ఎక్కువ సమాచారం ఉందన్నమాట.
అన్నీ తెలిసినా.. ఏమీ తెలియదంటున్న కేంద్రం..!
ఈ పరిస్థితిపై విపక్షాలు కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నాయి. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్..బ్యాంకుల వద్ద ఏపీ సర్కార్ పెట్టిన తనఖాలు.. హామీల గురించిన పత్రాలను బయట పెట్టి ... ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దాదాపుగా రూ.41వేల కోట్ల ప్రజాధనానికి లెక్కలు లేవని చెబుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం వీటన్నింటినీ తోసి పుచ్చుతోంది. తాము ప్రజల కోసమే అప్పులు చేస్తున్నామని వారిని ఆదుకోవడం తప్పా అని ఎదురు ప్రశ్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఇప్పటికీ చూసీ చూడనట్లుగానే ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ దయనీయమైన ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏమైనా మదింపు చేసిందా? అన్న మరో ప్రశ్నకు కేంద్రం లేదని సమాధానమిచ్చింది. అంటే.. ఏపీ ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో పడినా పట్టించుకోకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.