UNESCO Lists Lepakshi Temple : అనంతపురం జిల్లా(Anantapur) లేపాక్షి వీరభద్ర, రఘునాథ, పాపనాశేశ్వర ఆలయానికి యునెస్కో(UNESCO) తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని మూడు ఆలయాలను గుర్తించగా వాటిలో అనంతపురం జిల్లా లేపాక్షి(Lepakshi) ఆలయం ఒకటి. లేపాక్షి ఆలయంలో ఉన్న తై వర్ణ చిత్రాలు, ఏకశిలా నంది విగ్రహం, శిల్పకళా నైపుణ్యాన్ని గుర్తించి యునెస్కో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరో ఆరు నెలల్లో తుది జాబితా విడుదల కానుంది. అందులోనూ లేపాక్షి చోటు దక్కించుకుంటే ఏపీ నుంచి గుర్తింపు పొందిన ఆలయంగా చరిత్రలో నిలిచిపోతుంది. యునెస్కో గుర్తింపుతో పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుందని స్థానికుల అభిప్రాయపడుతున్నారు.
విజయనగర రాజుల కాలంలో నిర్మాణం
లేపాక్షి ఆలయానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. సైన్స్ కు అందని వింతలు, విశేషాలకు ఈ ఆలయం పెట్టింది పేరు. లేపాక్షిలో వీరభద్ర దేవాలయం 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడుగున నిర్మించారు. ఈ ఆలయ ప్రాంగణంలోని నంది విగ్రహం ఏకశిలతో నిర్మించారు. 108 శైవ క్షేత్రాల్లో లేపాక్షి ఆలయం ఒకటని స్కాందపురాణం తెలియజేస్తుంది. ఇక్కడి పాపనాశేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఎదురెదురుగా పాపనాశేశ్వరుడు, రఘునాథ మూర్తి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. విజయనగర రాజుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలోని శిల్పకళను చూడడానికి రెండు కళ్లూ చాలవని పర్యాటకులు అంటుంటారు. సీతమ్మవారని అపహరించుకొనిపోతున్న రావణుడితో యుద్ధం చేసి జటాయువు లేపాక్షిలో పడిపోయాడని, రాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే..పక్షి అని మోక్షం ప్రసాదించారని స్థల పురాణం చెబుతోంది. అందువల్లనే లేపాక్షి అని పేరు వచ్చిందని అంటారు.
ఏకశిలా విగ్రహం, వేలాడే స్తంభం
లేపాక్షి ముఖ ద్వారంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం కూర్చున్న భంగిమలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి 200 మీటర్ల దూరంలో మధ్యయుగం నాటి ఒక పురాతన శివాలయం ఉంది. లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటోంది. సందర్శకులు వేలాడే స్తంభాన్ని పదే పదే పరీక్షిస్తుంటారు. ఈ వేలాడే స్థంభాన్ని ఇతర స్తంభాలు పడిపోకుండా చూస్తుందని అంటారు. గాలిలో వేలాడే స్తంభం ఆ ఆలయానికి చాలా ప్రాముఖ్యతను తెచ్చిందనడంతో సందేహం లేదు.