Anantapur News : అనంతపురంలోని కొవ్వూరు నగర్ దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి మూతిపై ఆయా వాత పెట్టింది. బాలుడు అంగన్వాడీ కేంద్రంలో ఉండకుండా అమ్మ కావాలని బయటకు వెళ్లిపోతున్నాడని అక్కడ పనిచేస్తున్న ఆయా మూడేళ్ల చిన్నారి మూతిపై వాత పెట్టి తీవ్రంగా గాయపడింది. కొవ్వూరు నగర్‌లో లక్ష్మీదేవి, శింగారెడ్డి దంపతులు ఉంటున్నారు. వీరి మూడేళ్ల బాలుడు ఈశ్వర్‌ కృష్ణారెడ్డిని కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. రోజూలాగే శనివారం బాలుడ్ని అంగన్వాడీలో వదిలిపెట్టి వచ్చామని తల్లి చెబుతున్నారు. బాలుడు అమ్మ కావాలని ఏడవడంతో ఆయా చెన్నమ్మ బాలుడి మూతిపై వాత పెట్టిందని తల్లి ఆరోపిస్తుంది. బాలుడి మూతిపై బొబ్బలు వచ్చాయంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్నారి అని కూడా చూడకుండా కర్రతో కొట్టిందని తెలిపింది. బాలుడి కాళ్లు, వీపుపై వాతలు పడి ఎర్రగా కమిలిపోయాయని తల్లి ఆవేదన చెందుతుంది. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆరా తీశారు. స్థానిక అధికారులు అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. 



స్పందించిన మంత్రి ఉషశ్రీ చరణ్ 


అనంతపురంలోని కొవ్వూరు నగర్ లో ఆయా దారుణంపై మంత్రి ఉష శ్రీ చరణ్ స్పందించారు. సంబంధిత అంగన్వాడీ సెంటర్ ను మంత్రి ఉష శ్రీ చరణ్ సందర్శించారు. ఆయా చిన్నమ్మపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడేళ్ల చిన్నారి మూతిపై వాతలు పెట్టిన ఘటనపై మంత్రి చలించిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు హామీఇచ్చారు. బాలుడిని పరామర్శించి తల్లిదండ్రులను మంత్రి ఉష శ్రీ చరణ్ ఓదార్చారు. బాలుడు మూతిపై కడ్డీతో వాత పెట్టిన ఆయా చిన్నమ్మను విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. 



విద్యార్థులా, కూలీలా?


చిత్తూరు జిల్లా కేవి.పల్లె మండలం, మారెళ్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేజ్ కట్టడం కోసం గుణాతం తవ్వించారు. ఎర్రటి ఎండలో విద్యార్థుల చేత బండలు ట్రాక్టర్ లోడు చేయించి సిమెంటు బస్తాలు ఆటోలో లోడు చేయించారని పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. అనంతరం స్కూల్ కు తాళం వేశారు. రేయి పగలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని తమ బిడ్డలు బాగా చదువు కోవాలని ఆశతో స్కూల్ కు పంపిస్తే కూలి పని చేయిస్తారా అంటూ ఆగ్రహించారు. సమాచారం తెలుసుకున్న కేవి.పల్లి పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ధి చెప్పి స్కూల్ తాళాలు తెరిపించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.