YS Vijayamma : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది. కర్నూలులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విజయమ్మ ఏంకాలేదు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. అక్కడి నుంచి మరో కారులో విజయమ్మ వెళ్లిపోయారు. 


కారు టైర్ పేలడంతో


వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యప రెడ్డిని వైఎస్ విజయమ్మ గురువారం పరామర్శించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. అదుపుతప్పిన కారును డ్రైవర్ అతి కష్టం మీద అదుపు చేశారు.  ఈ ఘటనను గమనించిన స్థానికులు వైఎస్ విజయమ్మకు మరో కారు ఏర్పాటు చేశారు. దీంతో వైఎస్ విజయమ్మ అక్కడి నుండి వెళ్లిపోయారు.  


తిరుగు ప్రయాణంలో 


అనంతపురం జిల్లాలోని అయ్యప్పరెడ్డిని వైఎస్ విజయమ్మతో పాటు మరికొందరు నేతలు పరామర్శించారు. అయ్యప్పరెడ్డిని పరామర్శించిన అనంతరరం విజయమ్మ కారులో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో గుత్తి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారును డ్రైవర్ చాకచక్యంగా అదుపుచేయడంతో వైఎస్ విజయమ్మ  సహా కారులో ఉన్న మిగిలినవారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


వైఎస్ షర్మిలతో విజయమ్మ 


వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి వైఎస్ విజయమ్మ ఇటీవల రాజీనామా చేశారు. తెలంగాణలో తన కుమార్తె వైఎస్ షర్మిల ఒంటరిగా పోరాడుతోందని ఆమెకు అండగా ఉండేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్లీనరీలో వైఎస్ విజయమమ్మ రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఆ పార్టీ కార్యకర్తలు అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత విభిన్న కారణాలతో జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ సమయంలో వైఎస్ సెంటిమెంట్ ప్రధానంగా పార్టీని నడిపించింది. వైఎస్ విజయమ్మ పార్టీని ముందుండి నడిపించారు. ఆమెను గౌరవాధ్యక్షురాలిగా నియమించారు. తర్వాత వైఎస్  నియోజకవర్గం పులివెందులలో ఎమ్మెల్యేగా నిలబెట్టి విజయం సాధించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్షనేతగా పోరాడారు .  పార్టీ కోసం ఆమె చాలా కష్టపడ్డారు. పార్టీ సీనియర్ నేతలందరితోనూ ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 


వైఎస్ఆర్‌సీపీకి దూరంగా 


నిజానికి విజయమ్మ చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏపీలో  వైఎస్ఆర్‌సీపీ విజయం తర్వాత  ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వేదికపై కనిపించారు. ఆ తర్వాత కొన్నాళ్లుకు కుటుంబంలో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత షర్మిల రాజకీయ పార్టీ పెట్టడంతో పూర్తిగా  తెలంగాణకే పరిమితమయ్యారు. షర్మిల పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కారణంతో రాజీనామా చేశారు. కానీ గౌరవఅధ్యక్షురాలిగా ఉండటం వల్ల ఎలాంటి సమస్య రాదు. అది గౌరవనీయ స్థానం మాత్రమే. కానీ పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే రాజీనామా చేశారన్న వాదన వినిపిస్తోంది.


Also Read : YSRCP Internal Politics : ప్లీనరీలోనే గౌరవాధ్యక్షురాలి రాజీనామా ప్రకటనా ? షాక్‌లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు !


Also Read : Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !