ప్రముఖ కవి కళారత్న పద్మశ్రీ(Padmasri) అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాశరావు(Asavadi Prakash Rao)గురువారం ఉదయం తన స్వగృహంలో గుండెపోటు(Heart Attack)తో మరణించారు. అనంతపురం జిల్లా పెనుకొండ(Penukonda)లో తన స్వగృహంలో ఆశావాది ప్రకాశరావుకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన ఫలితంలేకపోయిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రకాశరావు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ramnath Kovind) చేతులమీదుగా తీసుకున్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పండితులు ప్రకాశరావు మృతి పట్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


బహుముఖ ప్రజ్ఞాశాలి


డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథ రచయితగా, అవధానిగా, కవిగా విశేష పేరు గడించారు. 1944 ఆగష్టు 2వ తేదీన ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, ఫక్కీరప్ప దంపతులకు అనంతపురం జిల్లా శింగనమల మండలం కొరివిపల్లి గ్రామంలో జన్మించారు. అసలు పేరు ఆసాది ప్రకాశం ఆయన గురువు నండూరి రామకృష్ణమాచార్య ఆశావాది ప్రకాశరావుగా మార్చారు. అనంతపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ బాయ్స్ స్కూల్ లో, రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్ లో 1953-1959 మధ్య చదివారు. అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1960-61 పీయూసీ చదివారు. అదే కాలేజీలో 1962-65లో బి.ఏ. స్పెషల్ తెలుగు చేశారు. తరువాత ఏపీపీఎస్సీ గ్రూప్-4 పరీక్షలో ఉత్తీర్ణులై లోయర్ డివిజినల్ క్లర్క్‌గా ఏలూరులో కొద్దిరోజులు పనిచేశారు. తన ప్రగతికి అవరోధంగా భావించి ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. వెంకటాద్రిపల్లె, వై.రాంపురం,కణేకల్, కుర్లి జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగు పండితుడిగా 1965-68లో పనిచేశారు. 


పద్మశ్రీ అవార్డు గ్రహీత  


ప్రముఖ అవధాని డాక్టర్ ఆశావాది ప్రకాశరావుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆయన ఎస్ఎస్ఎల్సీ నుంచి ఎం.ఏ తెలుగు వరకు అనంతపురంలోనే విద్యాభ్యాసం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 150కి పైగా అవధానాలు చేశారు ప్రకాశరావు. పుష్పాంజలి, లోకలిలా సూక్తం, మెరుపు తీగలు, రామకథ కలశం, దీవన సేసలు, పార్వతి శతకం, ఆత్మతత్వ ప్రబోధం, అవధాన కౌముది, అవధాన చాటువులు, వివేక పునీత నివేదిత వంటి పద్య రచనలు చేశారు. రాప్తాటి పరిచయ పారిజాతం, దోమావధాని, సాహితీ కుంజర మూర్తిమత్వం, ప్రసార కిరణాలు, సమారాధన, ప్రహ్లాద చరిత్ర ఎర్రన్న, భాగవత సౌరభం, సువర్ణ గోపురం, పోతనల తులనాత్మక పరిశీలన వంచి విమర్శ రచనలు కూడా రాశారు. చల్లపిల్లరాయ చరిత్రం వంటి పరిష్కరణలు ఆర్కెస్ట్రా, నడిచే పద్యం నండూరి వంటి సంకలనాలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రలు కలిపి మొత్తం 57 రచనలు చేశారు.