తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లును న్యాయస్థానం జప్తుకు ఆదేశించటం సంచలనంగా మారింది. ఈ వ్యవహరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో చంద్రబాబు అవినీతికి పాల్పడిన వ్యవహరాలు అన్ని బయటకు వస్తాయని అన్నారు. చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌తోపాటుగా నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతించటం పై సజ్జల స్పందించారు. 


లింగమనేని ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తే ఆధారాలు బయటపెట్టాలని సజ్జల రామకృష్ణా రెడ్డి సవాల్ చేశారు. చంద్రబాబుకు, లింగమనేనికి మధ్య ఏం ఒప్పందం జరిగిందో మీడియాకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒక పరిశోధనా సంస్థ ప్రాథమిక ఆధారాలతోనే చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని జప్తు చేసిందని ఆయన వివరించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సంతృప్తి చెందటం వల్లనే జప్తునకు కోర్టు అనుమతించిందని అన్నారు. 


నోరేసుకుకొని పడిపోతే సరికాదు...
పెద్ద నోరు పెట్టుకుని మాట్లాడితే అబద్దాలు నిజాలు అయిపోతాయి అన్నట్లుగా తెలుగు దేశం పార్టీ వ్యవహరిస్తోందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. కుంభకోణమే జరుగలేదంటూ బుకాయిస్తున్న తెలుగు దేశం ఎందుకు భయపడుతోందో చెప్పాలని అన్నారు. చంద్రబాబు తన హయాంలో లింగమనేని ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చినట్లు చెప్పటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉన్నవి లేనట్లుగా ప్రచారం చేసి, నోరు ఉంది కదా అని ఏదొకటి మాట్లాడేస్తే సరిపోదని ఆయన హితవు పలికారు.


అలా అయితే అప్పుడే లోపల వేసేవాళ్ళం..
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తెలుగు దేశం నేతలు చేస్తున్న ప్రచారాలను సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. రాజకీయ కక్ష సాధింపు చేయాలి అనుకుంటే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికించి లోపల వేసి ఉండే వారని అన్నారు. అయితే తాము అలాంటి చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని, తగిన ఆధారాల సేకరించిన తర్వాతే విచారణ జరుగుతోందని వివరించారు. 


లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్
స్కాం అనేది చంద్రబాబు తలలో పుట్టిన ఆలోచనల నుంచి వచ్చిందని విమర్శించారు సజ్జల. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు చేసినట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని, మొత్తం కుంభకోణంలో లింగమనేని ఇల్లు టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్ అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న రోజుల్లో ఈ కుంభకోణంలో అప్పటి మంత్రి నారాయణ కూడా లింక్‌గా వ్యవహరించారని అన్నారు. అధికార దుర్వినియోగానికి ఈ కేసు నిఖార్సైన ఉదాహరణగా సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన స్కాంలు ఆధారాలతో సహా బయటకు వస్తాయని తెలిపారు.


జప్తు పిటిషన్‌కు కోర్టు అనుమతి


చంద్రబాబు నివాసం ఉంటున్న  లింగమనేని గెస్ట్ హౌస్‌ను జప్తు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  లింగమనేని రమేష్ కు నోటీస్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. పిటిషన్‌ను అనుమతించడంతో ఇంటిని జప్తు చేసినట్లేనని భావిస్తున్నారు. ఇక లింగమనేని ఇంటిని అమ్మడం లేదా తనఖా పెట్టడం వంటివి చేయకూడదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై   విజయవాడ ఏసీబీ కోర్టులో  కేసు విచారణాధికారి ఏఎస్పీ కోర్టుకు హాజరై వివరాలు సమర్పించారు.  ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సీఐడీ పిటిషను అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది.