YSRCP Plenary 2022 Live Updates: వైఎస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా, ప్లీనరీలో సంచలన ప్రకటన

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ సమావేశాలు లైవ్ అప్ డేట్స్ ఇక్కడ పొందవచ్చు.

ABP Desam Last Updated: 08 Jul 2022 01:05 PM
YS Vijayamma Resigns: తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే

తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసినందుకు ఆమెకు రాజకీయంగా అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానని విజయమ్మ చెప్పారు. అందుకే వైఎస్ఆర్ సీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్నారు. విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకే వైఎస్ఆర్ సీపీలో గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఒక తల్లిగా ఎప్పుడూ జగన్ కు అండగా ఉంటానని, అలాగే వైఎస్ షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని మాట్లాడారు.


పూర్తి కథనం ఇక్కడ చదవండి


Also Read: YSRCP Plenary: గజదొంగల ముఠా మొత్తం మెక్కేసింది, ఇదంతా మన ఖర్మ కొద్దీ చూస్తున్నాం : వైఎస్ జగన్ ధ్వజం

YS Vijayamma: వైఎస్ విజయమ్మ రాజీనామా

ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉన్న సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఆ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఏకంగా ప్లీనరీ వేదికపైనే ప్రకటించారు. సీఎం జగన్ ప్రసంగం అనంతరం, మాట్లాడిన వైఎస్ విజయమ్మ తాను గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు.

మీ బిడ్డలను జగన్ చేతిలో పెట్టండి- రాష్ట్ర ప్రజలకు విజయలక్ష్మి పిలుపు

జగన్‌పై మీ అందరి ప్రేమ అభిమానం చూసి గర్వపడుతున్నాను. రాజశేఖర్‌ కొడుకుగా అడుగుపెట్టి... మీతో ఉంటానని భరోసా ఇచ్చి సీఎం అయ్యారు. జగన్ ఓ యూత్‌కు రోల్ మోడల్, మాస్ లీడర్. 2011లో మొదటి ప్లీనరీలో మాట్లాడుతూ... నా బిడ్డను మీకు అందించాను నడిపించుకోండి అని చెప్పాను... ఇప్పుడు మీరంతా అదే చేశాను. రాష్ట్రంలో పేద తల్లీదండ్రులూ... మీ బిడ్డను జగన్ చేతిలో పెట్టండీ బంగారు భవిష్యత్ ఉంటుందని చెబుతున్నాను. రైతులకు, అక్కచెల్లెళ్లను లక్షాధికారులను చేస్తారు. మీ ప్యామిలీ మెంబర్‌గా అన్నింటినీ ఆచరణలో పెడతారని చెబుతున్నాను. -- విజయలక్ష్మి, జగన్ తల్లి


పేదల జీవనశైలిని పెంచడమే అభివృద్ధి. అసలు ప్రతిపక్షాలు ఏం చేశాయని ఇప్పుడు విమర్శిస్తున్నారు. జగన్‌ను ఇప్పిట వరకు కాపాడుకుంటూ వచ్చారు... ఇకపై కూడా కాపాడుకుంటారని వేడుకుంటున్నాను. ప్రజలతో మాకు ఉన్న బంధం ఈనాటిది కాదు. 40 ఏళ్లకుపైబడిన బంధం ఇది. నా జీవితంలో మీరంతా భాగమయ్యారు. 


 


 

వైఎస్‌ఆర్‌సీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు- ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టిన పార్టీ

"రాజశేఖర్‌ రెడ్డి నా వాడే కాదు... మీ అందరివాడు... జగమంత కుటుంబంగా అందర్నీ ప్రేమించారు. ఇప్పటికీ మీ అందరి హృదయాల్లో ఉన్నారు. అందుకే ఇక్కడి నుంచి హ్యాపీ బర్త్‌డే చెబుతున్నాను. ఇది మూడో ప్లీనరీ. ఇప్పుడు అధికారికంలో ఉంటూ ప్లీనరీ జరుపుకుంటున్నారు. ప్రజలకు ఇది చేశాం అని ప్లీనరీలో చెబుతున్నాను. అందుకే అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికే ఇక్కడికి వచ్చాను.  దేశంలో చాలా రాజకీయ పార్టీలు అధికారం కోసం పుడతాయి. కానీ వైసీపీ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాట కోసం పుట్టింది. రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత చనిపోయిన వారి కుటుంబం ఆక్రందనల నుంచి వైసీపీ పుట్టింది. వాళ్లందరూ చూపించిన అభిమానం నుంచి పార్టీ ఆవిర్భవించింది. " -- విజయలక్ష్మి, జగన్ తల్లి


"దేశంలో శక్తి వంతమైన అధికార వ్యవస్థలన్నీ కేసులతో దాడి చేయగా... తాను చేస్తుంది ధర్మమని తలచి... దేనికీ లెక్క చేయకుండా ముందుకు నడిచారు జగన్. ఎంతో కష్టపడితే తప్ప ఇవాళ ఇక్కడ నిలబడ్డాం. కృషి పట్టుదలతో ప్రయత్నించి నాలుగున్నర దశాబ్ధాల సీనియర్ పొలిటీషియన్‌ గొంతును తడి ఆరిపోయేలా చేశారు జగన్."  -- విజయలక్ష్మి, జగన్ తల్లి


"జగన్ దృష్టిలో రాజకీయం అంటే అసత్య ప్రచారం కాదన్నారు. ప్రతిపక్షం ఏం చేస్తుందో పట్టించుకోకుండా తన దృష్టి అంతా ఎన్నికున్న ప్రజలకు న్యాయం చేయాలనే వ్యక్తిత్వం జగన్. అందుకే మొదటి సంవత్సరంలోనే 90 శాతానికిపైగా హామీలు అమలు చేశారు. మూడేళ్లల్లో ఇంటింటీకి చేసిన పనులను గడపగడపకు వెళ్లి చెబుతున్నారు. ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలకు ఇంటింటికి వెళ్లే పని ఉండదు.. కానీ ఇప్పుడు చేసిన పనులు చెప్పడానికి మూడేళ్ల తర్వాత పంపిస్తున్నారు. స్కీమ్స్‌తో ఏపీలో విప్లవం తీసుకొచ్చారు. జగన్ ప్రవేశ పెట్టిన పథకాలు మర్చిపోకుండా చెప్పగలరా అంటే ఆ పరిస్థితి లేదని చెప్పగలను. ఒకప్పుడు వైఎస్‌ సమకాలికుడిని ఓడించిన 23 సీట్లకే పరిమితం చేసిన ఘనత జగన్‌ది. వైఎస్‌ కంటే నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి జగన్. -- విజయలక్ష్మి, జగన్ తల్లి


 


 


 

CM Jagan Speech: పాలన అంటే ఇదే అని మనం చూపించాం - జగన్

‘‘రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని మనమే చేసి చూపించాం. పరిపాలనలో సంస్కరణలు ఇలా ఉంటాయని మనమే చేశాం. పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చి దిద్దుతున్నాం. వైద్యం, ఆరోగ్యంపై శ్రద్ధ అంటే ఇదీ అని మనం నిరూపించాం. అవినీతి, లంచం, వివక్షకు తావు లేకుండా చూపించాం. నవరత్నాలను కచ్చితంగా అమలు చేస్తున్నాం. అసలు ప్రతిపక్షానికి నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నా’’ అని జగన్ అన్నారు.

YS Jagan Speech in Plenary: ఆ పార్టీని 25 సీట్లకి పరిమితం చేశారు - జగన్

గత ఎన్నికల్లో ప్రజల అండదండలతో ఏకంగా 151 స్థానాలు సాధించగలిగామని వైఎస్ జగన్ అన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొన్న టీడీపీని 23 సీట్లకి, 3 ఎంపీ స్థానాలకి పరిమితం చేశారని గుర్తు చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా తనను ఆదరించారని అన్నారు. గత ముడేళ్లలో 95 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. తమ మేనిఫెస్టోను బైబిల్ గా, ఖురాన్, భగవద్గీతగా పరిగణిస్తున్నామని చెప్పారు. టీడీపీ నేతలు తమ మేనిఫెస్టోను జనానికి దొరక్కుండా, వెబ్ సైట్‌లో, యూట్యూబ్ లో నుంచి తొలగించారని జగన్ విమర్శించారు.

YSRCP Plenary లో సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం

వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. 13 ఏళ్ల క్రితం సంఘర్షణ ప్రారంభమైందని అన్నారు. పావురాల గుట్టలో సెప్టెంబరు 25న జరిగిన ఘటనతో ఇదంతా మొదలైందని అన్నారు. 13 ఏళ్లుగా తనకు అండగా ఉన్న ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. వారందరి సెల్యూట్ అని చెప్పారు.

YSRCP Plenary కి బయలుదేరిన సీఎం జగన్

కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్, విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్లీనరీ ప్రాంగణానికి బయలుదేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యుల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.

YS Rajasekhar Reddy: వైఎస్ ఘాట్ వద్ద సీఎం జగన్, షర్మిల నివాళులు

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళి అర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సీఎం కుటుంబ సమేతంగా కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం గుంటూరు జిల్లాలో జరిగే వైసీపీ ప్లీనరీకి హాజరుకానున్నారు. సీఎం వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, ఆమె కుమారుడు, కుమార్తె, ఇతర బంధువులు ఉన్నారు.

YS Rajasekhar Reddy: వైఎస్ జయంతి నేడు, సీఎం సహా కుటుంబ సభ్యుల నివాళి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ ఘాట్ వద్ద ఆయన సమాధికి నివాళి అర్పించనున్నారు. సీఎం వెంట భార్య భారతి, వైఎస్ సతీమణి విజయలక్ష్మి, కుమార్తె షర్మిళ, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైఎస్ ఘాట్ వద్ద అందరూ నివాళులర్పిస్తారు. ఇడుపులపాయలో ఈ కార్యక్రమం ముగియగానే సీఎం తాడేపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి నాగార్జున యూనివర్సిటీలో జరగనున్న వైసీపీ ప్లీనరీలో పాల్గొని, సమావేశాలు ప్రారంభిస్తారు.

Background

వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఎజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ ప్లీన‌రీలో కీల‌క అంశాలపై నేత‌లు చ‌ర్చించ‌నున్నారు. మొదటి రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ సభ్యుల రిజిస్ట్రేషన్ ఉంటుంది. 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండాను అద్యక్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన జరుగుతుంది. 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ త‌రువాత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. ఈ ప్రకియ‌ను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప‌ర్యవేక్షిస్తారు.


సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం ఉంటుంది. జగన్ స్పీచ్ తరువాత పార్టీ జమా ఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం ఉంటుంది. అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం జరుగుతుంది. 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాల నివేదన ఉంటుంది. ఆ తర్వాత తీర్మానాలు ప్రారంభం అవుతాయి, 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం ఉంటుంది. ఈ  తీర్మానం పై  మంత్రులు ఉషాశ్రీ చరణ్,  రోజా, ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతారు. రెండో అంశంగా విద్యపై తీర్మానం ఉంటుంది. ఒంటి గంటకు విద్యపై తీర్మానం  చేస్తారు.


ఈ అంశంపై  మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్  మాట్లాడుతారు. రెండు గంటల 15 నిమిషాల నుంచి పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం ఉంటుంది. డీబీటీపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతారు..మూడు గంటల 15 నిమిషాలకు వైద్యం పై తీర్మానం ఉంటుంది.వైద్య అంశంపై  మంత్రులు విడదల రజిని, డాక్టర్  సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనీల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడుతారు. సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ  జరుగుతుంది. ఈ అంశంపై  స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి మాట్లాడుతారు. సాయంత్రం ఐదు గంటలతో మొదటి రోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.


అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలి ప్లీన‌రీ
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన త‌రువాత జ‌రుగుతున్న తొలి ప్లీన‌రీ స‌మావేశం ఇది. దీంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ప్లీన‌రీ స‌మావేశాల‌కు త‌ర‌లి వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యక‌ర్తలు స‌మావేశాల‌కు త‌ర‌లి వ‌చ్చేందుకు వీలుగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల వార్లీగా ప్లానింగ్ చేస్తున్నారు. రెండో రోజు ముగింపు స‌మావేశానికి ల‌క్ష మంది వ‌స్తార‌ని అంచన వేస్తున్నారు. ఐదు సంవ‌త్సరాలకు ఒక సారి జ‌రిగే పార్టీ పండుగ కావ‌టంతో క్యాడ‌ర్ తో పాటుగా నాయ‌కులు కూడా ఉత్సాహంగా ఈ స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు అవ‌స‌రం అయిన అన్ని చర్యల పైనా దృష్టి సారించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.