AP Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోంది. శుక్రవారానికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 25వ తేదీ నాటికి మరింత బలపడి తుపానుగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై లేకపోయినా అక్కడక్కడ వానలు పడొచ్చని వాతావరణ శాఖాధికారులు అంచనావేస్తున్నారు. నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరుగా వానలు ఉంటాయి. 






ఇప్పటికే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఇవాళ పార్వతీపురం జిల్లా, అల్లూరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. రేపు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం గోదావరి జిల్లాలు, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడబోతున్నాయి.  






అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అందుకే చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొలం పనులకు, ఇతర పనులపై బయటకు వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.  పిడుగులు పడే ప్రమాదం ఎత్తైన చెట్ల కింద అసలు ఉండొద్దని హెచ్చరిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బుధవారం 1.1 ఎం ఎల్‌ వర్షపాతం కురిసింది. జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కువ  వర్షపాతం పార్వతీపురం మన్యం జిల్లాలో 13.2 ఎంఎల్, చిత్తూరులో 4.1 ఎంఎల్‌, ఏలూరులో 3.9 ఎంఎల్ నమోదు అయింది. అత్యధిక ఉష్ణోగ్రత నంద్యాల, జంగమేశ్వరపురం 38.5 డిగ్రీలు, అత్యల్పం ఆరోగ్యవరంలో 23 డిగ్రీలు రిజిస్టర్ అయింది. 



నైరుతి రుతపవనాల అప్‌డేట్‌ 
నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలు, కొమోరిన్ ప్రాంతం, అండమాన్ నికోబార్‌ దీవులలోని కొన్ని ప్రాంతాలను తాకాయి. మే 30,31 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.