ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేపదే ప్రజలను తన మాటలతో , చేతలతో మోసం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సీఎం జగన్ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పేదలకు మేలు చేసే ఉద్దేశం మాత్రం ముఖ్యమంత్రికి లేదని ఆయన విమర్శించారు. ఆర్ 3 జోన్ లో ఇళ్లు కట్టేందుకు అవకాశం ఉన్నప్పటికీ పేదవారిని మోసం చేసేందుకే ఆర్ 5 జోన్ సృష్టించారని అందుకే వారికి హైకోర్టు నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందని పట్టాభి అన్నారు.
అమరావతి ఆర్ 3 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 44 ఎకరాల్లో దాదాపు 5,024 ఇళ్లు పేదల కోసం నిర్మించారని తెలియజేశారు. ఈరోజుకి కూడా ఆర్ 3 లో 1675 ఎకరాల భూమి పేదలకు ఇళ్లు నిర్మించేందుకు సిద్ధంగా ఉంది. కానీ వైసీపీ గవర్నమెంట్ కావాలానే మరో కొత్త జోన్ ఏర్పాటు చేసి చతికిల పడింది. పేద వారి కోసం ఇళ్లు నిర్మించడం ఎలాగో తెలియకపోతే..చంద్రబాబుతో పాఠాలు చెప్పించుకో జగన్ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన మూడున్నరేళ్లలో రెండు జిల్లాల్లో కలిపి ఇప్పటి వరకు పేద వారికి నిర్మించిన ఇళ్లు కేవలం 4.7 శాతం మాత్రమే అంటూ విమర్శించారు.
జగన్ కి పేదల పై ఉన్న ప్రేమ ఇదేనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏపీ ప్రజలు కళ్లు తెరిచి జగన్ ఆడుతున్న జగన్నాటకాన్ని గుర్తించాలని పట్టాభి అన్నారు. ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం వెంటనే ఆపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పేదల కోసం ఆర్ 5 జోన్ లో ఇళ్లు నిర్మిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాంటి అవసరం ఏమి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.