సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం కొత్త ట్విస్టు ఇచ్చింది. ఏపీలో ఉద్యోగులకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ప్రభుత్వం. సీపీఎస్ రద్దుకు బదులు జీపీఎస్ ప్రతిపాదన తీసుకొచ్చింది. గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.
ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో జరిగిన చర్చల్లో ఈ కొత్త విధానాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. దీనిపై ఉద్యోగ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇది నమ్మేలా లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమించిన తర్వాత ఆ స్థాయిలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఈసారి పోలీసులు విజయవంతంగా సీపీఎస్ ఉద్యోగులు పిలుపునిచ్చిన " చలో విజయవాడ"ని అడ్డుకోగలిగారు. నిలువరించగలిగారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు విషయంలో ఒత్తిడి ఎందుకు ఎదుర్కొంటోంది ? చాలా సమస్యకు చూపించినట్లుగా ఇన్స్టంట్ పరిష్కారం ఎందుకు చూపించలేకపోతోంది ?
ఇటీవల పీఆర్సీ కోసం ఉద్యోగులు రోడ్డెక్కినప్పుడు జరిపిన చర్చల్లో ప్రభుత్వం సీపీఎస్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. సీఎం జగన్ మార్చి 31లోగా సీపీఎస్ రద్దుపై "రోడ్ మ్యాప్" సిద్ధం చేస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెలాఖరు వస్తున్నా పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ విజయంలో అత్యంత కీలకమైనది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం తీసుకు వస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. వారితో కలిసి ప్లకార్డులు పట్టుకుని ఉద్యమంలో నడిచారు. కానీ మూడేళ్లయింది. ఇప్పటికీ రద్దు చేయలేదు. చేయడానికి దారులు కూడా ప్రభుత్వానికి కనిపించలేదు. ఇప్పటి వరకూ వేచి చూసిన ఉద్యోగులు ఇక ఆగడం లేదు. రోడ్డెక్కుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయినా సీపీఎస్ రద్దు చేయడం ఆషామాషీ కాదు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మొత్తం.. కేంద్రంతో ముడిపడి ఉంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ యాక్ట్‌లో ఒక్క బెంగాల్ మినహా అన్నీ రాష్ట్రాలు చేరాయి. ఈ స్కీమ్ నుండి వైదొలిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే కేంద్రానికి లేఖ రాస్తే ఆ దిశగా చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయి. సీపీఎస్ అమలుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి బయటకు రావాలంటే చాలా ఆర్థిక భారం పడుతుంది. బయటకు రావాలని నిర్ణయించుకున్నప్పటికీ... నిధుల విత్‌డ్రాలో అనూహ్యమైన, అవాంఛనీయ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సీపీఎస్ నుంచి బయటకు రావడానికి అవకాశాలను పరిశీలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఆ కమిటీ రెండు ఆప్షన్లు సూచించింది. ఒకటి ఎంత ఖర్చయినా భరించి సీపీఎస్ రద్దు చేయడం.. రెండు సీపీఎస్ ద్వారా ఉద్యోగులు కోల్పోయే ప్రయోజనాలను కల్పించడం. కానీ ఉద్యోగులు రెండో దానికి అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై మిగతా ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీపీఎస్ గురించి తెలియకుండానే సీఎం జగన్ హామీ ఇచ్చారని పీఆర్సీపై చర్చల సమయంలో ఓ ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని లెక్కలు చెప్పారు. సీపీఎస్ రద్దు చేయడం అసాధ్యం కాబట్టి... వారికి పెన్షన్ సెక్యూరిటీ ఎలా అని ఆలోచిస్తున్నామని ప్రకటించారు. సీపీఎస్ విషయంలో టెక్నికల్ ఇష్యూస్ తెలియకుండా హామీ ఇచ్చారు కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని ప్రకటించారు. అప్పుడే ఉద్యోగ సంఘాలు భగ్గమన్నాయి. సీపీఎస్ రద్దు చేసి తీరాల్సిదేనన్నాయి.