Niti Aayog Natural Farming : సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు.  సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి స్పెషల్‌ సీఎస్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ సీహెచ్‌ హరి కిరణ్‌‌, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు. 






సదస్సులో పాల్గొన్న సీఎం జగన్ 


ఈ సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు.  ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన పద్దతులు, ఇతర సమాగ్రిని గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నామన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని సీఎం జగన్ సూచించారు. ఏపీలోని ఆర్బీకేలను నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రశంసించారు. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. 


ప్రకృతి వ్యవసాయం కీలకమైన ఆవిష్కరణ 


"ప్రకృతి వ్యవసాయం అనేది రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. పౌరుల పోషకాహార అవసరాలను పరిరక్షిస్తుంది. నేలను పునరుత్పత్తి చేయడంతో పాటు నీటి సంరక్షణను పెంపొందించడంలో కీలకమైన ఆవిష్కరణ" అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.