Rains In AP Telangana : దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలపై ఉంది. ఈ ప్రాంతాల్లో మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం చల్లగా ఉంటుంది, మరో మూడు రోజుల తరువాత ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో, తెలంగాణలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఈ ప్రాంతాల్లో ఈరోజు వాతావరణ పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖ నగరంతో పాటుగా చుట్టుపక్కన ఉండే ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, పాడేరు జిల్లాల్లో తీవ్రమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. విశాఖ నగరంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదవ్వనుంది. దీనికి తోడుగా తేమ గాలిలో అధికంగా ఉండటం వల్ల ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. మరో వారంపాటు ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. తూర్పు గోదావరి, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎండల తీవ్రత 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండి రాత్రికి కాస్తంత చల్ల పడనుంది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు ఎలాంటి వర్షసూచన లేదు. నెల్లూరు, ఒంగోలులో మాత్రం వేడి కంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. రాయలసీమ జిల్లాల్లో నంద్యాల బెల్ట్, కడప-అనంతపురం ప్రాంతాల్లో ఎండలు విపరీతంగా ఉంటున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని సూచించారు. కర్నూలు జిల్లా అవుకు లో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. నగరాల వారీగా తిరుపతి నగరంలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదయ్యింది.
తెలంగాణలో వెదర్ అప్‌డేట్స్..
నేటి నుంచి మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, పరిసర ప్రాంతాలనే మేఘాలు కమ్ముకున్నా, వేడి ప్రభావం మాత్రం అధికం. గరిష్ట ఉష్ణోగ్రత 40, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ లోని బేగంపేటలో అత్యధికంగా 38.5 డిగ్రిల ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ, నైరుతి దిశల నుంచి గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: బంగారం స్వల్ప ఊరట! నేడు తగ్గిన పసిడి ధర - వెండి మాత్రం నిలకడగా