మాచర్ల ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. డిసెంబర్ 16 న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడు వెంకటరామి రెడ్డి నాయకత్వంలో మాచర్లలో అల్లకల్లోలం సృష్టించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాచర్ల ఘటన పై టీడీపీ పోరాటం...
మాచర్ల ఘటన రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఐదు గంటల పాటు ప్రజలపై, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల పై, మహిళలపై భౌతిక దాడులకు పాల్పడి వారి ఇళ్లను తగులబెట్టారని ఆయన ఆరోపించారు.  2019లో దళితులు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు అధికార పార్టీ గూండాలతో దళితులపై దుర్మార్గంగా దాడికి పాల్పడుతోందని ఆరోపించారు. నాడు అనేక దళిత కుటుంబాలు ప్రాణభయంతో మాచర్లను విడిచి గుంటూరు శిబిరాలలో తలదాచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు ఆ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. తురక కిషోర్ అనే వ్యక్తి టీడీపీ సీనియర్ నాయకుల కారుపై దాడిచేసి చంపడానికి ప్రయత్నించినా ఎటువంటి చర్యలు లేవని, డిసెంబర్ 16న పోలీసులు కార్డెన్ సర్చ్ చేసిన తర్వాత కూడా వైసీపీ గూండాలు ప్రతిపక్షనేతలపై మారణాయుధాలతో దాడి చేయడం జరిగిందని అన్నారు.
ప్రతిపక్షాలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..
ప్రతిపక్ష పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేసి మాచర్ల టౌన్ వదిలి వెళ్లాలని హుకుం జారీ చేయటం దారుణమని, గత కొన్ని నెలలుగా ప్రజలు మాచర్లను వదిలి బయటకు పోయే పరిస్థితులు నెలకొన్నాయని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. మాచర్లలో అధికార పార్టీ నాయకుల ప్రైవేటు గూండాలు 16 మందిని హత్య చేసినా పోలీసులు హంతకులను అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని, మాచర్ల ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నివాసాలు విడిచిపెట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్‌ గుంటూరులో తలదాచుకున్న రోజులు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇలాంటి దారుణమైన దాడులు జిల్లాలో జరుగుతున్నా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం దిగ్భ్రాంతికరమని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దాడులతో పాటు ఆస్తులను ధ్వంసం చేయడం గతంలో రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదన్నారు. సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కూడా మాచర్లను సందర్శించడానికి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదని, ఇది ప్రజాస్వామ్యం కాదన్నారు.


దాడికి గురై స్పృహ కోల్పోయిన బాధితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, వర్ల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల ప్రజలకు ప్రాథమిక హక్కులను పునరుద్ధరించే అన్ని ప్రయత్నాలను పోలీసులు తీవ్రంగా నిలిపివేస్తున్నారని, ఈ నేపథ్యంలో కలెక్టర్ గా, జిల్లా మేజిస్ట్రేట్ గా  రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని లేఖలో కోరారు. జిల్లా మేజిస్ట్రేట్‌‌గా ప్రతి పౌరునికి రక్షణ కల్పించాల్సిన భాధ్యత ఉందని వివరించారు. భౌతిక దాడులకు బాధ్యులైన గూండాలు, వారికి సహకరించిన పోలీసు అధికారుల పై నిష్పాక్షిక విచారణ నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్తులు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
మానవ హక్కులపై టీడీపీ పోరాటం...
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా పెరిగిపోతున్న దాడులు అచారకాలు ఇవీ అంటూ టీడీపీ నేతలు ఆత్మకూరులోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శలో వైసీపీ నేతల దాడుల ఘటనల ఫొటోలను టీడీపీ ప్రదర్శించింది.