టీడీపీ నేతలు కొందరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనాను కలిశారు. ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఓటర్ల జాబితాకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అనంతరం ఏపీ సచివాలయం దగ్గర మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షాల వైపు ఉన్న ప్రజల ఓట్లన్నీ తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.


అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా వెల్లడించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని.. ఇంతవరకు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టులో తమ ప్రమేయం ఏం లేదని అమిత్ షా చెప్పినట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.