Chandra Babu News:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన వారికి ఇప్పుడు చిక్కులు తప్పడం లేదు. అన్యాయాలకు, అక్రమాలను అడ్డుకోవాల్సిన ఐఏఎస్ అధికారులు కొందరు వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అండగా నిలబడ్డారనే విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తమ స్థాయి మరిచి వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారనే పేరు మూటకట్టుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి న్యాయస్థానంలో దోషులుగానూ నిలబడ్డారు. ఎన్ని విమర్శలొచ్చినా పట్టించుకోకుండా వైసీపీ అజెండాను భుజాన మోశారని టీడీపీ నేతలంతా దుమ్మెత్తిపోశారు. వారంతా వందల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారనే విమర్శలు ఉన్నాయి. జగన్‌ ప్రభుత్వంలో అధికారుల నిబంధనల ఉల్లంఘించన గురించి రాస్తే పెద్ద పుస్తకమే అవుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. అలాంటి అధికారులపై కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 


అన్నీ తానై నడిపిన జవహర్ రెడ్డి
రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉంటూ జవహర్‌రెడ్డి పూర్తిగా వైసీపీ నేతగా మారిపోయానే అపవాదు మోస్తున్నారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు, అస్మదీయ గుత్తేదారులకు అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు చేశారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వచ్చాక వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధమయ్యారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లబ్ధిదారులకు ఇంటి వద్దకు పింఛన్ల పంపిణీని జవహర్‌రెడ్డి నిలిపేశారని దుమ్మెత్తిపపోస్తోంది. ఎన్నికల సమయంలో విడుదల చేసేందుకు ప్రయత్నించి ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని గురయ్యారు. ఎన్నికల సమయంలో వైసీపీకి అత్యంత అనుకూలమైన అధికారులను కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించడంలో జవహర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. విశాఖ చుట్టుపక్కల పేదల నుంచి ఎసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంలోనూ జనసేన నాయకుడు మూర్తియాదవ్‌ ఆయనపై అనేక ఆరోపణలు చేశారు. అందుకే ఆయన్ని తప్పించి నీరబ్ కుమార్ ను నియమించేలా చేశారు. 


ఉద్యోగులను వేధించిన ప్రవీణ్ ప్రకాశ్
జగన్‌ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తీరే వేరు అంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టించడంలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారట. సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులనూ ఇబ్బంది పెట్టేవారనే విమర్శలు ఉన్నాయి. విద్యాశాఖలో కీలక బాధ్యతలు చేపట్టాక ఉపాధ్యాయులను బెదిరించడం, వేధించడం చేశారని పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు పైరవీలకు తలొగ్గి 1,400 మంది ఉపాధ్యాయుల్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని టీడీపీ ఆరోపించింది. పాఠశాల విద్యాశాఖలో జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధ్వంసకర విధానాలన్నింటికీ ఆయనే కారణమని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం సైతం వ్యక్తం చేశాయి.


షాడో సీఎం ఆయనే
ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయరెడ్డి ఐదేళ్లూ చెలరేగిపోయారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. సీఎస్‌కు మించి ఆయన అధికారులపై పెత్తనం చేశారని,  షాడో సీఎంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించేందుకు పథక రచన చేయడంలో ధనుంజయరెడ్డి కీలకపాత్ర పోషించేవారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆర్థికశాఖను గుప్పిట్లో పెట్టుకున్నారని, ఆయన నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే నిధులు విడుదల జరిగేదనే విమర్శలు ఎన్నో.  ఆఖరికి వైసీపీ నాయకులకు పదవులు దక్కాలన్నా, పనులు కావాలన్నా, అధికారులకు పోస్టింగ్‌లైనా, బదిలీలైనా ఆయన చేతుల మీదుగా జరగాల్సిందే. ధనుంజయరెడ్డిపై ఇటీవల రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 


ఆయన రూటే సపరేటు
సీఎం కార్యాలయం నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఢిల్లీ వెళ్లిపోయాక ఆ స్థానంలోకి రేవు ముత్యాలరాజు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యదర్శితో పాటు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సైతం ప్రవీణ్ ప్రకాశ్ స్థాయిలో పెత్తనం చలాయించారని చెబుతారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకుండా నిలిపివేశారు. అత్యంత వివాదాస్పదమైన జీవో నం.1 జారీ వెనుక ఈయన పాత్రే కీలకం అన్న వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చేలా... రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరించే అధికారులను ముత్యాలరాజే ఎంపిక చేశారని టీడీపీ ఆరోపించింది. 


ఆర్థిక అరాచకానికి రావత్ అండ 
వైసీపీ పాలనలో సాగిన ఆర్థిక అరాచకానికి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్‌ రావత్‌ అండదండలు అందించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం రూ.11 లక్షల కోట్లకు చేరడానికి ఆయనే కారణమని ధ్వజమెత్తుతున్నారు. ఖజానా ఆదాయాన్ని వేరే కార్పొరేషన్లకు దొడ్డి దోవలో మళ్లించి అప్పులు తీసుకువచ్చేందుకు రావత్‌ ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టించారని, కిందిస్థాయి సిబ్బందిని బెదిరించి పనులు చేయించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.


అన్నీ తానై నడిపించిన శ్రీలక్ష్మి
సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి వైసీపీ ప్రభుత్వంలోనూ హవా నడిపించారనే టాక్ ఉంది.  పురపాలకశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి కొన్ని రోజుల ముందు పట్టణ స్థానిక సంస్థల్లో వివిధ పనులకు రూ.400 కోట్లకుపైగా బిల్లులు చెల్లించేందుకు ఆఘమేఘాలపై జీఓలిచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థలో వైసీపీ నేతలు చేయించిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఆమె అనుమతులిచ్చారన్నది వారి ఆరోపణ. టీడీఆర్‌ బాండ్ల వ్యవహారంలో అధికారులు నిర్ణయించిన ధరకు ఆమె గుడ్డిగా తలూపారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


చెప్పిన చోటల్లా సంతకాలు
గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీరు మరో రకం. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన ద్వివేది వైసీపీ అధికారంలోకి రాగానే అసాధారణమైన పోస్టులు దక్కించుకున్నారట. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండగానే ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం వంటి వివాదాస్పద నిర్ణయాల్ని అమలు చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉంటూ ఇసుకలో టెండరు ఒకే సంస్థకు కట్టబెట్టారని టీడీపీ వర్గాల ఆరోపణ. ఇసుక గుత్తేదారు సంస్థ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు చెల్లించకోయినా ఆయన పట్టించుకోలేదు. వైసీపీ పెద్దలు చెప్పిన చోట్ల సంతకాలు చేస్తూ ద్వివేది గనులశాఖ పని చేశారనే ఆరోపణలు ఉన్నాయి.