పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ, ఆధారాలతో కూడిన వీడియోను కూడా చంద్రబాబు ఎన్నికల అధికారులకు అందజేశారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన వ్యవహరంపై టీడీపీ సీరియస్ అయ్యింది. కౌంటింగ్ సెంటర్స్‌లో భద్రత పెంచడంతోపాటు నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్‌లో వైసీపీ లీడర్లు చొరబాటు ఘటనను లేఖలో ప్రస్తావించిన టీడీపీ అధినేత.. అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.


వైసీపీపై చంద్రబాబు ఫైర్....


ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అధికార వైసీపీ అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ మూకలు అక్రమ పద్దతుల ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తునారని ఆరోపించారు.  అనంతపురంలో పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు.


రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వైసీపీ లీడర్లు ఎలాంటి పాసులు లేకుండా కౌంటింగ్ సెంటర్‌లోకి అక్రమంగా వెళ్లి అలజడి సృష్టించారని అన్నారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లపై దాడి చేసి కౌంటింగ్ స్టేషన్‌లో గందరగోళం సృష్టించారన్నారు. వారిని అరెస్టు చేయకుండా పోలీసులు టీడీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఓటమిని నుంచి బయటపడడానికి వైసీపీ నేతలు కౌంటింగ్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోందన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇలాంటి అక్రమాలు వైఎస్‌ఆర్‌సీపీకి అలవాటుగా మారాయని చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికార వైఎస్సార్‌సీపీ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది చట్ట ప్రకారం విధులు నిర్వర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో తక్షణమే భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. 


టీడీపీ కౌంటింగ్ ఏజెంట్ ధనంజయరెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేసి, కౌంటింగ్ హాల్‌లో రభస సృష్టించిన దోషులను అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులను, స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఎటువంటి పాసులు, గుర్తింపు కార్డులు లేకుండా కౌంటింగ్ స్టేషన్‌లో చొరబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుచరుల వీడియోను లేఖకు జత చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.


ఎన్నికల కౌంటింగ్ పై చంద్రబాబు పర్యవేక్షణ...
టీడీపీ పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో, నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు ఫోన్ చేసి మరి మాట్లాడారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం.కే మీనా, అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, ఎస్పీ ఫకీరప్పతో ఫోన్‌లో మాట్లాడిన టీడీపీ అధినేత అధినేత స్దానికంగా ఉన్న పరిస్దితులు, అధికార పార్టికి చెందిన నేతల దురుసు ప్రవర్తన, బెదిరింపులపై సమాచారం అందించారు. 


అనంతపురం కౌంటింగ్ సెంటర్ లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ శ్రేణులపై చర్యలను తీసుకోవాలని, చంద్రబాబు కోరారు. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ చివరి దశలో పెద్ద ఎత్తున అక్రమాలకు వైసీపీ సిద్దమైందని ప్రధాన ఎన్నికల అధికారి మీనాకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేకుండా, కౌంటింగ్ సెంటర్ల వద్ద నిబంధనలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని అధికారులను కోరిన చంద్రబాబు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, ఎన్నిక బాధ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.