Go Back CM Sir Flex : విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో జులైలో విశాఖకు వెళ్తున్నామని మంత్రులతో అన్నారు. ఈ సమయంలో విశాఖలో ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు ముఖ్యప్రాంతాల్లో గో బ్యాక్ సీఎం సర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.  జన జాగరణ సమితి పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కార్యాలయం మార్పు వల్ల అనేక లక్షల ప్రజాధనం వృథా అవుతుందని, ముందు అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. విశాఖలో రాజధాని పేరుతో విలువైన స్థలాల కబ్జా జరుగుతుందని ఆయన ఆరోపించారు. 




జులై నుంచి విశాఖకు - సీఎం జగన్ 


జులై నుంచి విశాఖకు వెళ్తున్నామని మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లుల కోసం ఇటీవల కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. అధికారికంగా కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి పరిపాలన గురించి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే చెబుతున్నారు. ఉగాది వేడుకల్ని కూడా విశాఖలోనే నిర్వహించాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడే కాదని సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీతో స్పష్టమయిందని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. 


రాజధానుల వ్యవహారంలో కీలక మలుపు


ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. సీఎం జగన్ జూలైలో విశాఖకు వెళదామని మంత్రివర్గ సహచరులకు చెప్పారు. అదే సమయంలో.. గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన లేదు. కనీసం వికేంద్రీకరణ ప్రస్తావన లేదు. దీంతో మూడు రాజధానులపై ప్రభుత్వం మళ్లీ పునరాలోచనలో పడిందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. చట్ట పరంగా మూడురాజధానులు అనేది సాధ్యం కాదన్న వాదన చాలా కాలంగా ఉంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనుకడుగు వేస్తూండటంతో ఇతరుల్లోనూ ఇది సాధ్యం కాని  పనిగా అంచనాకు వస్తున్నారు. 


గవర్నర్ ప్రసంగంలో లేని మూడు రాజధానులు 


గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ వ ఏపీ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో  మూడు రాజధానులు, వికేంద్రీకరణ అనే అంశాలు లేవు.  ప్రభుత్వం ఆమోదించే ప్రసంగాన్ని గవర్నర్ చదువుతారు. అయినా ఇందులో మూడు రాజధానుల ప్రస్తావన ప్రభుత్వం తీసుకు రాలేదు.  అలాగే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా మూడు రాజదానుల బిల్లంటూ హడావుడి ఉంటుంది.  ఈ సారి కేబినెట్ సమావేశం కూడా నిర్వహించారు. అయితే మూడురాజధానుల గురించి మాట్లాడలేదు. దీంతో  ప్రభుత్వం  వెనుకడుగు వేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉగాది నుంచి పరిపాలన అనుకున్నప్పటికీ..  ఇప్పుడు సీఎం జగన్ ముహుర్తాన్ని జూలైకి వాయిదా వేశారు.