వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత ఉందని కచ్చితంగా ప్రజలు బుద్ది చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. పార్టీ ముఖ్యనేతలు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, మండల, డివిజన్ అధ్యక్షులతో సమావేశమైన చంద్రబాబు.. తాను చేపడుతున్న యాత్రపై ప్రజల్లో వచ్చిన స్పందన వివరించారు. 


 వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని... వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోతే తనకు భవిష్యత్ ఉండదని సీఎం జగన్ భావిస్తున్నారన్నారు చంద్రబాబు. టీడీపీ గెలవాల్సిన అవసరాన్ని ప్రజలే చెబుతున్నారని... ప్రజాస్పందన చూస్తుంటే వైఎస్‌ఆర్‌సీపీకి ఇవే చివరి ఎన్నికలని అభిప్రాయపడ్డారు. 


ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతున్న టైంలో వైఎస్‌ఆర్‌సీపీ డైవర్షన్ గేమ్ ఆడుతోందన్నారు చంద్రబాబు. మొన్నటికి మొన్న తన సభలో జైజగన్ అన్నట్టు మార్ఫింగ్ వీడియో సృష్టించి ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఇలాంటి వాటి వ్యూహల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నేతలకు చంద్రబాబు సూచించారు. 


బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేపడుతున్న జిల్లాల పర్యటనకు ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని.. దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు చంద్రబాబు. రోజూ ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు వివరించి చెప్పాలన్నారు చంద్రబాబు. ఇప్పుడు ప్రజల్లో ఉన్న స్పందన గతంలో ఎప్పుడూ చూడలేదని.. టీడీపీ గెలవాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు.    


వైసీపీ అరాచకాలు ఇంకెంతకాలం కొనసాగవన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వారి అరాచకాలకు ముగింపు పలికేందుకు సమయం దగ్గరపడిందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలపై అసలు వడ్డీతో సహా తీరుస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. టీడీపీ నాయకులపై జరుగుతున్నదాడులపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయన్నారు. వైసీపీ వర్గాలపై ఇంతవరకు కేసునమోదు చేయకపోవడం దారుణమన్నారు. పొత్తులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.