వార్‌జోన్‌లో దిగామని... శత్రువులను సంహరించి జగన్ మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయాలన్నారు స్పీకర్ తమ్మినేని సీతారం. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభలో మాట్లాడిన ఆయన... చంద్రబాబు, అచ్చెన్నపై తీవ్ర విమర్శలు చేశారు. తోకలు కత్తిరిస్తామన్న వాళ్లకు వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపుతామన్నారు. 


ఇన్నాళ్లూ ఆత్మన్యూన్యతతో బాధపడుతున్న బీసీలు తల ఎత్తుకొని గౌరవంగా బతికే స్థాయి ఇచ్చిన సీఎం జగన్‌తు అంతా ధన్యవాదాలు చెప్పాలన్నారు తమ్మినేని సీతారాం. బీసీలంటే చాలా పెద్ద చరిత్రే ఉందని గుర్తు చేశారు. ఇతిహాసాల్లో కీలక ఘట్టాల్లో ఉన్న వాళ్లంతా బీసీలేనంటూ రామాయణ మహాభారత్‌ ఇతిహాసలు గుర్తు చేశారు. అలాంటి బీసీల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. బీసీలు న్యాయమూర్తుగా రాణించలేరని లేఖలు కూడా రాశారని తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు భాష మార్చి వేషాలు మార్చి మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. 


రూపు మార్చి వస్తున్న చంద్రబాబు పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తమ్మినేని సీతారాం. బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో సత్తా చూపుతామన్నారు. బీసీల దెబ్బ ఏంటో చూపిస్తారన్నారు. పవర్‌ లేని కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని అన్న అచ్చెన్నపై కూడా తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జాగ్రత్త  అచ్చెన్నా టంగు తెగుద్దని వార్నింగ్ ఇచ్చారు. ఆత్మగౌరవంతో బతికే స్థితిలో ఉన్న పదవులను చూసి కాగితాలతో పోలుస్తారా అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీసీలే చరిత్రను తిరగరాస్తారని అన్నారు. 



ప్రభుత్వం ఇచ్చిన ఏ పదువుల్లో చూసుకున్నా బీసీలకు సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు తమ్మినేని. 
మంత్రిమండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీలు, రాజ్యసభలో ఎక్కడ చూసుకున్నా బీసీలకు ప్రయార్టీ ఉందన్నారు. కార్పోరేషన్లు చూస్తే... ఎక్కడా బీసీలను తక్కువ చేయలేదని లెక్కలతో వివరించారు. 56 కులాల్లో ఒక్కో కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఐదేళ్లలో టీడీపీ ఇచ్చిన నిధులు 964 కోట్లు ఉంటే... వైసీపీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 90,415 కోట్లరూపాయలు ఇచ్చామన్నారు. 


ఇలాంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని బీసీలకు పిలుపునిచ్చారు తమ్మినేని సీతారాం. ఇంకో ఆలోచన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. జగన్ వెంటే ఉండాలన్నారు. ఆయన్ని తిరిగి సీఎంగా చేసినప్పుడే ఈ బీసీ గర్జనకు సార్థకత ఉంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ జన గణన చేయాలని వైసీపీ ఎప్పుడో చెప్పిందని ఇంతవరకు కేంద్రమే ముందడుగు వేయలేదన్నారు. పొరపాటున బీసీలు తప్పు చేస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. 


పేదలు ఉండకూడదని నేరుగా ప్రగతి ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్నారని తెలిపారు తమ్మినేని. ఇంత నిజాయతీగా ధైర్యంగా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు దైవంలా నిలబడ్డారని కితాబు ఇచ్చారు. జగన్ కుటుంబంలో తామంతూ సభ్యులమని అన్నారు. ఈ గర్జన ఊపుతో ఎన్నికల సమరానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. బీసీలకు జరిగిన సంక్షేమాన్ని ప్రతి గడపకు, ప్రతి బీసీ పౌరుడికి చేరాలని కోరుకుంటున్నాను.