Sajjala Ramakrishna Reddy: ఐదేళ్ళ పాలనను పూర్తిగా సద్వినియోగం చేస్తామని ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ముందస్తుకు వెళ్ళే అవకాశాలు లేవని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై కొన్ని పార్టీలు, మీడియా సంస్థలు చేసేది హడావిడి మాత్రమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు సంబంధించిన వరకు ఐదేళ్లు, ఆఖరి రోజు వరకు పూర్తిగా వినియోగించుకుంటామని ఆయన క్లారిటి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి సమయం అవసరం ఉందని అన్నారు. అంతే కాదు తమ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన చాలానే ఉన్నాయని ఆయన తెలిపారు. ముందస్తు అనే ప్రతిపాదన రావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు నుండి అన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అయితే పవన్ ను ఒప్పించు కోవడానికే తెలుగు దేశం ముందస్తు ప్రచారం చేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ సోఫా కింద..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై కూడాా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటి ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. అదే రీతిలో కేంద్రం నుండి, ప్రధాన మంత్రి కూడా సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినపుడల్లా, ఆయన సోఫా కింద ఎవరైనా కూర్చుంటారా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ఎదో విన్నట్టుగా అన్ని విషయాలను వివరించి మరి చెబుతారంటూ అసహనం వ్యక్తం చేశారు.
పాజిటివ్ ఓట్ పైనే నమ్మకం...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో చేసిన సంక్షేమం నేపథ్యంలో కేవలం పాజిటివ్ ఓట్ ను మాత్రమే నమ్ముకున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన సంక్షేమ పధకాలు, ప్రజలకు అందుతున్నాయన్న సంతోషం అన్ని వర్గాల నుండి వ్యక్తం అవుతున్న నేపథ్యం, ఇతర రాజకీయ పార్టీలు ఎన్ని రకాలుగా తప్పుడు ప్రయత్నాలు చేసినా, జగన్ వాటిని పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. టార్గెట్ 175 కేంద్రంగా తమ ప్రభుత్వం ప్రజల ముందుకు వెళుతుందని ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టి, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటాతోనే నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇచ్చింది, ఆడుకోవడానికి మాత్రం కాదని సజ్జల ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కట్ట వద్దని న్యాయస్దానం చెప్పలేదని అన్నారు.
షర్మిలపై సజ్జల కామెంట్స్..
షర్మిల పార్టీ మార్పు వ్యవహరాలపైనా సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఒకసారి పార్టీ పెట్టాక అదంతా ఆమె వ్యక్తిగత ఇష్టం అని సజ్జల అన్నారు. ఆమె నిర్ణయం ఆమెదని, తాము దాంట్లో కలగజేసుకోబోమని అన్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు.