పల్నాడు జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి ఉంది. నరసరావుపేటలో జరిగిన కొట్లాటతో పరిస్థితి అదుపు తప్పింది.  దీంతో పోలీసులు జోక్యం చేసుకొని 144 సెక్షన్ విధించారు. 


ఆదివారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన కొట్లాట రాళ్లదాడికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరసర్పం రాళ్లు విసురుకుంటూ కర్రలతో కొట్టుకున్నారు. టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు టార్గెట్‌గా దాడి జరిగినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. హింసాత్మక ఘటనలో అరవింద్ బాబు కారు ధ్వంసం కాగా... ఓ పోలీసు వాహనానికి అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు.


నరసరావుపేటలో టెన్షన్ టెన్షన్..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. శనివారం చల్లా సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో టీడీపీ నేతపై కక్షగట్టి వైసీపీ శ్రేణులు ఆదివారం ఒక్కసారిగా చల్లా సుబ్బారావు నివాసంపై దాడికి దిగాయి. సమాచారం తెలియగానే టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సుబ్బారావు ఇంటికి చేరుకున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకునే క్రమంలో గొడవ పెరిగి పెద్దదైంది. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. 


వైసీపీ కార్యకర్తల దాడిలో టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంటి కిటికీలతో పాటు ఇంట్లోని ఫర్నిచర్‌ ధ్వంసమయ్యాయి. ఆ ఇంటిని సుబ్బారావు ఆక్రమించుకున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ దాడి చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ నేతల దాడుల్ని నిలువరించి, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఇరు వర్గాలు చేసుకున్న రాళ్ల దాడిలో పోలీసుల జీపుతో పాటు టీడీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నేత అరవిందబాబు కారు డ్రైవర్‌ తలకు గాయాలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సైతం అక్కడికి చేరుకున్నారు. గొడవ పెద్దది కావడంతో పోలీసులు మరింతగా శ్రమించి టీడీపీ, వైసీపీ శ్రేణులను అతికష్టమ్మీద చెదరగొట్టారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial