Agri Gold Victims: లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు, ఒక్కొక్కరిది ఒక్కో గాథ, ఒక్కో వ్యథ. ఎవరిని కదిపినా గుండెను చెరువు చేసే పరిస్థితి. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఏళ్లుగా వేడుకుంటున్నారు. అయినా వారి డబ్బులు రావడం లేదు. లక్షల మంది చిరు వ్యాపారులు, బడుగు జీవులు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు పొదులు చేయాలనుకున్నారు. బిడ్డల పెళ్లిళ్లు, చదువులు ఇతర భవిష్యత్ అవసరాల కోసం అగ్రి గోల్డ్ లో డబ్బు దాచుకున్నారు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

  


కలెక్టరేట్ ఎదుట ధర్నా.. 
గుంటూరు కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా చేపట్టారు. అగ్రి గోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, తమ డబ్బులు చెల్లించాలని వేడుకున్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తుల్ని వెలికి తీసి వడ్డీతో సహా చెల్లించాలని కోరారు. కుటుంబ పరిస్థితులు దిగజారాయని, ఎన్నో ఆశలతో డిపాజిట్ చేసిన డబ్బులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల పెళ్లిళ్లు, ఉన్న చదువులు, ఇల్లు కట్టుకోవడం కోసమని రూపాయి రూపాయి కూడబెట్టి డబ్బులు చెల్లించామన్నారు. కట్టిన డబ్బులకు మంచి వడ్డీ ఇస్తారన్న ఆశతో అగ్రి గోల్డ్ సంస్థలో కూడబెట్టామని అన్నారు. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో వడ్డీ దెవుడెరుగు, కనీసం అసలు కూడా రావడం లేదని ఆవేదన వెల్లగక్కారు. తమ ఆశలు గల్లంతు అయ్యాయని, పిల్లల పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిపారు. ఉన్నత చదువులు చదవాలనుకున్న తమ పిల్లలు వారి కలలను మొగ్గలోనే తుంచేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 


ఆత్మహత్యల నుండి కాపాడండి.. 
ఆత్మహత్యల నుండి అగ్రిగోల్డ్ బాధితులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అగ్రి గోల్డ్ బాధితులు వేడుకున్నారు. డిపాజిట్లను చెల్లించేందుకు ప్రభుత్వం రూ. 3,965 కోట్లను అడ్వాన్సుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు. సెప్టెంబరు 6న విజయవాడలో భారీ ప్రదర్శనగా ధర్నా చేసి తీరతామని వెల్లడించారు. 


ఏమిటి ఈ అగ్రిగోల్డ్ స్కామ్? 
అవ్వాస్ వెంకట రామారావు మరియు మరికొంత మందితో కలిసి విజయవాడలో కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ (CIS)గా ప్రారంభించారు. రాబోయే 20 సంవత్సరాలకు, తమ పెట్టుబడి అధిక రాబడితో వారికి తిరిగి వస్తుందని వాగ్దానంపై కంపెనీ అనేక లక్షల మంది వినియోగదారులను ఆకర్షించింది. కంపెనీ ఈ డబ్బును తీసుకొని రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టిందని, ఇతర ప్రాంతాలకు కూడా బ్రాంచ్ చేయడానికి ముందు, రిటర్న్‌లు మాత్రమే పెరుగుతాయని తమ కస్టమర్‌లకు వాగ్దానం చేస్తున్నాయని ఆరోపించారు. 2014లో పరిస్థితులు దిగజారడం ప్రారంభించాయి. అదే ఏడాది నవంబర్‌లో విజయవాడలోని కంపెనీ కార్యాలయం చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని, వడ్డీ చెల్లించడం లేదని పలువురు వినియోగదారులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


జనవరి 2015 నాటికి తమ డబ్బు తిరిగి రావడం లేదని వేలాది మంది వచ్చారు. వీరిలో కొందరు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టగా, మరికొందరు కొన్ని కోట్ల రూపాయలను కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆ నెలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావుపై చీటింగ్, మోసం మరియు అక్రమాలకు సంబంధించిన అనేక కేసులు నమోదు చేసి, అతని ఆస్తులపై దాడులు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అనుమతి లేకుండానే కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అప్పట్లో వెల్లడైంది. కొద్ది రోజుల్లోనే స్కాం పెద్దఎత్తున జరగడంతో కేసు సీఐడీకి బదిలీ అయింది. ప్రభుత్వ ఆస్తులు అటాచ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. డబ్బు తిరిగి ఇస్తామని బాధితులకు హామీ ఇచ్చింది.