Pawan Kalyan Family News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నమోదు చేసిన అద్భుతమైన ఫలితాలు పార్టీ నాయకుల్లోనే కాక, పవన్ కల్యాణ్ కుటుంబంలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపినట్లయింది. అంతకుముందు పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యా చాలా తక్కువగా బయట కనిపించేవారు. కానీ, పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలిచిన రోజు నుంచి ఆయన కుటుంబం మొత్తం ఆయన వెంటనే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఆయన భార్య అన్నా లెజినోవా ఆయన పక్కనే ఉంటున్నారు. పైగా కుమారుడు అకీరా నందన్ కూడా పవన్ వెంట ప్రతి సందర్భంలోనూ కనిపిస్తుండడం విశేషం. 


జూన్ 4న పవన్ కల్యాణ్ గెలుపు వార్త తెలియగానే ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. అప్పుడే ఆయన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అకీరా బయటకు వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత పవన్ హైదరాబాద్ టూ విజయవాడ, విజయవాడ టూ హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారి వీరు పక్కనే ఉంటున్నారు. పవన్ చంద్రబాబును కలిసిన దాదాపు ప్రతిసారి ఆయన కుమారుడు అకీరా వెంటనే ఉంటూ వచ్చాడు. ప్రధాని మోదీని పవన్ కల్యాణ్ కలిసినప్పుడు కూడా అకీరా నందన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


గన్నవరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కుటుంబంతో పాటు, మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలిసి ఓ అందమైన ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అప్పుడు క్లిక్‌మనిపించిన అందమైన ఫోటో.. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరిన సందర్భంలో దిగిన ఫోటో అని చెబుతున్నారు. 


అదే సమయంలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడగా.. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి ఓ చెట్టు కింద కుటుంబం మొత్తం సేద తీరిన క్షణంలో ఆ ఫోటో దిగారని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో పవన్ కల్యాణ్ ట్రెడషనల్ లుక్‌లో దిగిన ఫోటో ఇప్పుడు అభిమానులను విపరీంగా ఆకట్టుకుంటోంది.