కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 85 ఏళ్ల వయసులో హరిరామజోగయ్య ఈ దీక్ష చేపట్టారని.. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నామని అన్నారు. హరిరామజోగయ్య వయసు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం, బాధ్యులు తక్షణం చర్చలు చేపట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.


దీక్ష భగ్నం


చేగొండి హరిరామజోగయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాపు రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం నుంచి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఆదివారం రాత్రి హరిరామజోగయ్యను అంబులెన్స్ లోకి ఎక్కించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సోమవారం ఉదయం నుంచి దీక్ష చేసేందుకు ముందు రోజు నుంచే ఆయన ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రోడ్ల మీద బారికేడ్లు ఏర్పాటు చేసి నిషేదాజ్ఞలు విధించారు.


హరిరామజోగయ్య అల్టిమేటం


జగన్‌రెడ్డి ప్రభుత్వానికి మాజీ ఎంపీ హరిరామజోగయ్య అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం తాను చావడానికైనా సరే సిద్ధమని స్పష్టం చేశారు. దీక్షకు అనుమతి కోరినా పోలీసులు ఇవ్వలేదని, దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించినా తాను దీక్షను కొనసాగిస్తానని హరిరామజోగయ్య స్పష్టం చేశారు. కాపులపై సీఎం జగన్‌కు ఏ మాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో ప్రయత్నించారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి జగన్‌ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని గుర్తు చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్‌ కాపులకు అన్యాయం చేశారని హరిరామజోగయ్య దుయ్యబట్టారు.


అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈనెల 30లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య తెలిపారు.  


అయితే ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని హరిరామజోగయ్య డిమాండ్ కు మద్దతు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం నుంచి జోగయ్య డిమాండ్ పై స్పష్టత రాలేదు. సీఎం జగన్ కాపు రిజర్వేషన్లపై సానుకూల నిర్ణయం తీసుకుంటారా? లేక వేచిచూసే ధోరణే అవలంభిస్తారో తెలియాల్సి ఉందని కాపు సంఘం నేతలు అంటున్నారు.