Pawan Kalyan Viral Fever: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నట్లుగా ఏపీ సమాచార ప్రసారశాఖ వెల్లడించింది. ఆయన అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలోనే కొన్ని శాఖలపై రివ్యూలు నిర్వహించినట్లుగా వెల్లడించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి అన్నారు. స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. 






అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి వైద్యుల సూచనలు తీసుకొంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు.


Also Read: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు - పరారీలో ఉండగా పట్టుకున్న పోలీసులు


Also Read: క్రిష్ణా జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్, విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్


ముంపు బాధితులు అందరికీ నిత్యావసరాలు - మంత్రి నాదెండ్ల మనోహర్


వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు శుక్రవారం నుంచి నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సుమారు 2లక్షల మంది లబ్ధిదారులకు పంపిణీ అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 179 వార్డు, 3 గ్రామ సచివాలయాల పరిధిలో పంపిణి చేస్తామని, ఈ పోస్ మిషన్లో నమోదు చేసి పంపిణీ చేస్తామని అన్నారు. వరద బాధితులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించిందని అన్నారు.