హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయా విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా హైదరాబాద్ – విజయవాడ నగరాల మధ్య  కీసర గ్రామం వద్ద (నందిగామ మండలం, ఎన్.టి.ఆర్.జిల్లా) NH 65 హైవే పై మున్నేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నందని తెలిపారు. అందువల్ల వాహనాల రాకపోకలకు వీలు లేదని, అందువల్ల హైదరాబాద్ – విజయవాడ, విజయవాడ – హైదరాబాద్ ల మధ్య ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల క్షేమం కోరి వాహనాలను అనుమతించడం లేదని గురువారం (జూలై 27) రాత్రి ఓ ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్  వెల్లడించారు.






కాబట్టి, ఈ విషయాన్ని గమనించి హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వయా విజయవాడ మీదుగా అదేవిధంగా విశాఖపట్నం నుండి హైదరాబాద్ ప్రయాణించే వాహనదారులు ఈ కింద తెలిపిన మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించారు.


• హైదరాబాద్ – నార్కెట్ పల్లి – మిర్యాలగూడ – దాచేపల్లి – పిడుగురాళ్ల- సత్తెనపల్లి – గుంటూరు – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి – విశాఖపట్నంకు  వెళ్ళాలి.


• విశాఖపట్నం- రాజమండ్రి- ఏలూరు – విజయవాడ – గుంటూరు – సత్తెనపల్లి – పిడుగురాళ్ళ – దాచేపల్లి – మిర్యాలగూడ – నార్కెట్ పల్లి – హైదరాబాద్ కు వెళ్ళాలి
 
వాహనాదారులు తమ ప్రయాణాలను ఈ కొత్త మార్గాల ద్వారా మార్చుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, వాహనదారులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం కోసం పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 7328909090 కు సంప్రదించాలని సూచించారు.