రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందని అన్నారు. అతి త్వరలోనే పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగ్గా లేదని, వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరావతిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీఎం రమేశ్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో చూశామని గుర్తు చేశారు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే రానున్నట్లు చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగమే వెసులుబాటు కల్పించిందని అన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి కార్యక్రమాలపై ఈ నెల 28వ తేదీన బీజేపీ సభ నిర్వహిస్తోందని రమేష్ వివరించారు. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. మెల్లగా అర్థం చేసుకుంటారని బీజేపీ ఇన్నాళ్లూ వేచి ఉందని, ఇకపై చర్యలు చూస్తారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతిపై ఈ నెల 28న బీజేపీ సభ నిర్వహించనుందని ఎంపీ సీఎం రమేశ్ ప్రకటించారు.
సినిమా టికెట్ల ధరలపై ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యం ప్రజా సమస్యలపై ఎందుకు లేదని నిలదీశారు. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై థియేటర్ యజమానులు కోర్టుకు వెళ్తే, హాళ్లను సీజ్ చేయిస్తారా అంటూ మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు ఎంత ఉన్నాయి? అక్కడి విధానం ఏంటో ఓసారి చూడాలని సూచించారు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బ తిన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇసుక అందుబాటులో లేదని.. సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. దశలవారీ మద్య నిషేధం కాకుండా.. దశలవారీ మద్యపాన వినియోగాన్ని జగన్ ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని ఎద్దేవా చేశారు. ఏపీలో జరిగే ప్రతి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తోందని అన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం కూడా కేంద్రం నిధులతోనే చేపట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల నిర్మాణం బిల్లులు కూడా ఇవ్వలేదని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు.. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదని.. రెండున్నర ఏళ్లల్లో స్టీల్ ఎలా ఉత్పత్తి చేస్తారని అడిగారు.
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి