Janasena Chief Pawan Kalyan| తుని: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారని తెలిసే కూటమి అభ్యర్థులపై వైసీపీ దాడులకు పాల్పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. కూటమి ఎంపీ అభ్యర్థులు సీఎం రమేష్, బాలశౌరిపై దాడులకు కారణం అదేనన్నారు. వైసీపీ దాడులకు అర్థం ఏంటంటే.. ఎన్నికల్లో మనం గెలవబోతున్నామని అర్ధం అన్నారు. ఎంత మెజార్టీతో గెలుస్తున్నామో చెప్పలేను కానీ కూటమి ప్రభుత్వం రావడం పక్కా అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక సంవత్సరం లోపే CPS సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. తుని నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా వైసీపీ పాలన
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు, దోపిడీలు పెరిగిపోయాయి. ఏదైనా మాట్లాడితే బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వేధింపులు. పైగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లుగా సాగింది. అరాచక పాలనను అంతం చేసేందుకు 2021లోనే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పాను. మనమంతా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏకమయితే సాధ్యమవుతుంది. భద్రత, అభివృద్ధి గల సమాజం కావాలంటే కూటమిని ఆశీర్వదించాలని’ కోరారు.
చెల్లికే ఆస్తి ఇవ్వలేదు... మన ఆస్తులను వదులుతాడా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత దుర్మార్గమైందని, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యాక్ట్‌పై జీవో ఇవ్వలేదు, అభిప్రాయసేకరణ మాత్రమే జరుగుతుందని వైసీపీ నాయకులు చెబుతున్నది పచ్చి అబద్ధంమని.. యాక్ట్ కు సంబంధించిన జీవో విడుదల అయ్యిందన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన జగన్ రూ.25 వేల కోట్లు అప్పు తీసుకొచ్చాడన్నారు.
తోడబుట్టిన చెల్లి షర్మిలకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించారు. 30 వేల మంది ఆడబిడ్డలు రాష్ట్రం నుంచి అదృశ్యమైపోతే ఒక్క ముక్క మాట్లాడలేదు. ప్రభుత్వ ఆస్తులనే దర్జాగా తాకట్టుపెట్టిన అలాంటి వ్యక్తి చేతిలో మన ఆస్తులు పెడితే గాల్లో దీపం పెట్టినట్లే అన్నారు. మీ వరకు రాలేదని ఈ రోజు మౌనంగా ఉంటే ఏదో ఒక రోజు మీ వరకు వస్తుందని వైసీపీ మద్దతుదారులను పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
వేట విరామ సమయంలో ఆర్థిక సాయం
దివీస్ ఫార్మా వల్ల ప్రతి రోజు లక్షల లీటర్ల విషపూరిత రసాయన వ్యర్ధ జలాలు సముద్రంలో కలుస్తాయనీ, దాంతో మత్స్య సంపద అంతరించి స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట మార్చి కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రసాయన వ్యర్థాలు శుద్ధి చేశాకే సముద్రంలో కలిపేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. అలాగే మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో నెంబర్ 217ను రద్దు చేసి, వేట విరామ సమయంలో రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.