Pawan Kalyan about Mudragada Padmanabham daughter | తుని: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గౌరవాన్ని తాను తగ్గించనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తుని నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి, ఆయన అల్లుడు చందు జనసేన పార్టీ (Janasena Party)లో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అయితే జనసేన పార్టీలో వారి చేరికను పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. 


ఓ తండ్రి బిడ్డలను వేరు చేస్తానా..? 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తాను కులాల ఐక్యత కోరుకునే వ్యక్తినని, సమాజంలో మనుషులు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటా అన్నారు. అలాంటి తాను ఓ తండ్రి బిడ్డలను వేరు చేస్తానా..? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రీల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో అనిపించుకున్నారు. ముద్రగడ పెద్దాయన అని.. కోపంలో పది మాటలు అంటారు. మనం భరించాలి అని పవన్ అన్నారు. క్రాంతి, చందుల మెడలో ఈ రోజు జనసేన పార్టీ కండువా వేస్తే పెద్దాయన ముద్రగడ పద్మనాభం గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందన్నారు. 




ఎన్నికల కోసం తండ్రి బిడ్డలను వేరు చేసి వాడుకున్నట్లు ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనలో మనకి ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నా, మనందరం కలిసే ప్రయాణం చేయాలన్నారు. ఓ రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో ఒకడిగా చెబుతున్నాను. మీకు గౌరవం ఇచ్చే బాధ్యత నాది అని... ముద్రగడ పద్మనాభంని ఒప్పించిన తరువాతే మిమ్మల్ని పార్టీలో చేర్చుకుంటానని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.  


కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని విజ్ఞప్తి 
తుని నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్య, పాయకరావు పేట నుంచి పోటీ చేస్తున్న వంగలపూడి అనితను, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.