Pawan Kalyan about Early elections in AP: ఇది ఎన్నికల సంవత్సరంలా కనిపిస్తోంది, ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల సంకేతాలను పార్టీ నేతలు దృష్టిలో పెట్టుకోవాలని నడుచుకోవాలన్నారు. రాజకీయ పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని, ఒకవేళ పార్టీ స్థాపించినా రన్ చేయడం తేలిక కాదన్నారు. బెదిరింపులకు భయపడకుండా తనకు మద్దతుగా నిలిచిన వారికి, పార్టీకి అండగా నిలిచిన వారికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం అని, విలువలు పాటించే వ్యక్తులు రాజకీయాల్లోకి రాకూడదని, అలాంటి పరిస్థితులు కల్పించాలని అధికార వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకు వైజాగ్ లో తన పర్యటనను గుర్తుచేశారు. చిత్తూరు, శ్రీకాళహస్తిలో గొడవలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ పాలన ఎలా ఉందంటే.. రాజకీయం అంటే భయపెట్టడం, బెదిరించడం అనేలా ఉందన్నారు. రాజకీయం అంటే బాధ్యత, జవాబుదారీతనం ఉండాలని పవన్ అభిప్రాయపడ్డారు. జగన్ అనే అరాచకశక్తిపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన శ్రేణులకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.
న్యాయమార్గంలో ఎవరూ ఉండకూడదు, ఒకవేళ న్యాయంగా డబ్బు సంపాదించినా జనాలు మాట్లాడకూడదు, కామ్ గా కూర్చోవాలి అనే తీరుగా సీఎం జగన్ పాలన ఉందని విమర్శించారు. గతంలో రాజకీయాలపై ఏదో మూల ప్రజల్లో భయం ఉన్నా, ఇప్పుడు వైసీపీ దాన్ని పరిపూర్ణం చేసిందంటూ సెటైర్లు వేశారు. తనకు అపారమైన జనాధరణ ఉందని, తెలంగాణలోనూ పార్టీ నడుపుతున్నాం కానీ అక్కడ ఇబ్బంది కలగలేదన్నారు. కానీ ఏపీలోనే జనసేనను ఎదుర్కొనేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదన్నారు. త్యాగం, బాధ్యత, విలువలు, జవాబుదారీతనం ఉన్నవారి వెంట ప్రజలు నడుస్తారని పవన్ చెప్పారు.
నా చుట్టూ తిరిగితే నాయకులు కాలేరు. ఏరోజూ కూడా సీట్ల కోసం ఎవ్వరి నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని జనసేనాని స్పష్టం చేశారు. ఒకవేశ సీటు కోసం ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే ఇది మీ తప్పిదమే అని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ఇటీవల ఒకరు తన మనిషి అని చెప్పి, పవన్ తో ఫోటో తీయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఇలాంటివి ప్రోత్సహించకూడదని, వీటిని మొగ్గ దశలోనే తుంచివేయడం మంచిదన్నారు.
ప్రతి ఒక్కరికి ఉన్నట్లే రాజకీయ నాయకులకు సైతం ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని.. గరిష్టంగా వందేళ్లు బతికితే బతుకుతాం అన్నారు. వయసు మీద పడ్డవాళ్లు యువతను రాజకీయాల వైపు ప్రోత్సహించాలని సూచించారు. తన తండ్రితో మాట్లాడుతుంటే క్రియా యోగా చేయమని సూచించారని.. నాకు వయసు మీద పడింది, నువ్వు యువకుడివి చాలా ఏళ్ల జీవితం ఉంటుందని చెప్పిన మాటల్ని పవన్ గుర్తుచేసుకున్నారు. నాగబాబు లా చదివే సమయంలో ఇచ్చిన నాని ఫాల్కి పుస్తకం తనను ప్రభావితం చేసిందన్నారు. టీనేజీ వయసు నుంచే ఎన్నో విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకున్నానని, అందరూ తమ నాలెడ్జ్ పెంచుకుంటూ పోతూనే ఉండాలన్నారు.