Jada Sravan Kumar: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. అమరావతి రైతులకు మద్దతుగా దీక్షకు దిగిన జడ శ్రవణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జడ శ్రవణ్ కుమార్.. వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పోలీసులతో తన దీక్షను అడ్డుకున్నప్పుడే ఈ సర్కారు పిరికిపందగా మారిందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు.. అవినీతికి తావు లేకుండా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా పరిపాలన అందిస్తానని చెప్పి ఇప్పుడు దానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ చెవుల్లో ప్రతిబింబిస్తున్నాయని జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. 


Also Read: Jada Sravan Kumar: హత్యలు, మారణహోమాలు సృష్టించే జగన్.. నువ్వా మా భవిష్యత్: జడ శ్రావణ్ ఘాటు వ్యాఖ్యలు


'అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన'


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజ్యాగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన చేస్తున్నట్లు శ్రవణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేశారు. నీతి మాలిన రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. అమరావతి బాధితులకు బాసటగా నిలబడటం మా ప్రాథమిక హక్కు అని జడ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. అమరావతి రైతుల కోసం దీక్ష చేస్తే పోలీసులతో భగ్నం చేయిస్తారా అని ప్రశ్నించారు. అమరావతిలో రాజధాని కోసం ఎవరు భూములు ఇస్తే, ఎవరికి పంచుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.


'పేదలపై చిత్తశుద్ధి ఉంటే 5 సెంట్లు ఇవ్వండి'


రాష్ట్ర పేదలపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రతి కుటుంబానికి 5 సెంట్ల ప్రభుత్వ భూమి పంపిణీ చేయాలని సూచించారు. పోలీసులతో దీక్షకు అడ్డుకున్నప్పుడే వైసీపీ ప్రభుత్వం పిరికిపందగా మారిపోయిందని జడ శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. ఈ రోజు చేసిన దీక్షకు మద్దతుగా తుళ్లూరు శిబిరం వద్దకు వచ్చిన మహిళలకు, రైతులకు వందనాలు అంటూ పేర్కొన్నారు. అమరావతే మన భవిష్యత్ అని.. అమరావతిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ తీరుపై బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చే హక్కు తమకు లేదా అని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.


Also Read: Ganguly Kolkata Sheriff: 'దాదా గౌరవం' చుట్టూ బెంగాల్ రాజకీయం, బీజేపీ - తృణమూల్ మధ్య మాటల తూటాలు!


అక్రమ అరెస్టులకు నిరసనగా ఆందోళనలు


అక్రమ అరెస్టులను నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసనలు నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. జగన్ పల్లకి మోసిన బడుగు బలహీన వర్గాలు.. ఇప్పుడు బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి కుర్చీ కోసం శవ రాజకీయాలు చేసింది నీవు కాదా అని జడ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్న బొత్స, ధర్మాన గతంలో ఈ వ్యాఖ్యలు చేయలేదా అని నిలదీశారు. ఈ నెల 26న జరగబోయే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై ప్రతి ఒక్కరూ నిరసన వ్యక్తం చేయాలని కోరారు.