Guntur News: తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రజల భాగస్వామ్యంతో రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయదశమి నాడు ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేస్తామని, దానిపై ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ జరిగాక ఎన్నికల సమయంలో అసలైన ప్రణాళిక ప్రవేశపెడతామని చెప్పారు. గుంటూరు టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బీసీ ఐక్య కార్యాచరణ సదస్సులో మాజీ మంత్రులు యనమన రామకృష్ణుడు, కొల్లు రవీంద్రతో పాటు పలువురు బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 


'బీసీ కార్పొరేషన్లను నామమాత్రం చేశారు'


బీసీల సమగ్ర కుల గణన, వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీల ఐక్య కార్యాచరణ సదస్సులో నాయకులు చర్చించారు. ఎన్టీఆర్ వచ్చాకే బీసీలకు ప్రాధాన్యం వచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎన్టీ. రామారావు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. ఆ రిజర్వేషన్లను టీడీపీ హయాంలో చంద్రబాబు 34 శాతానికి పెంచారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విభజించి పాలించడం అలవాటైందని విమర్శించారు. 54 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే మిగిలాయని ఆరోపణలు చేశారు. బీసీల కుల గణన జరగాలని.. ఈ అంశంపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయాడు పేర్కొన్నారు. బీసీ జన గణన కోసం అంతా ఏకం కావాలని యనమన రామకృష్ణుడు సూచించారు. బీసీల ఐక్యత వర్ధిళ్లాలి అనే నినాదాన్ని నిజం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలని అన్నారు. దాదాపు 144 కులాలు విడివిడిగా పోరాడితే ఏమీ సాధించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని సర్కారును డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల మాదిరిగానే చట్ట సభల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరగాలని యనమల రామకృష్ణుడు ఆకాంక్షించారు.


వేమగిరిలో మహానాడుకు ముమ్మర ఏర్పాట్లు


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి వద్ద జరగనున్న మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించే పార్టీ కార్యక్రమానికి నేతలు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ, 28వ తేదీన మహానాడు బహిరంగ సభ జరగనుంది. వీటి కోసం వేర్వేరు వేదికలను సిద్ధం చేస్తున్నారు. 27న జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేలకు మించి జనాభా హాజరు అవుతారని టీడీపీ పార్టీ అంచనా వేస్తోంది. అలాగే తరువాతి రోజు జరిగే మహానాడు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, తెలుగు దేశం అభిమానులు లక్షల్లో వస్తారని అంచనా. వీరి కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


అలాగే ప్రతినిధుల సభ, మహానాడు కార్యక్రమాలకు వచ్చే అతిథులకు గోదావరి రుచులతో ఆత్మీయ ఆతిథ్యం పలకనున్నట్లు నాయకులు చెబుతున్నారు. టీడీపీ.. మహానాడు నుండే ఎన్నికల శంఖారావం పూరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరం రాజకీయ కేంద్రం లాంటిది. అక్కడి నుండే మహానాడు ద్వారా ఎన్నికల శంఖారావం పూరించడం శుభసూచకమని టీడీపీ నేతలు అంటున్నారు.