Bopparaju Venkateswarlu: డీఏ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా స్పష్టం చేయాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తుంటామని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని అందుకే ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న 27వ మహాసభ కార్యక్రమ పోస్టర్లను బొప్పరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొప్పరాజు వెంకటేశ్వర్లు.. పీఆర్సీ బకాయిలను, నాలుగు డీఏ బకాయిలను ఎలా చెల్లిస్తుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.


ఉద్యోగుల మిగతా డిమాండ్లపైనా చర్చ జరగాలని, వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు. ప్రస్తుతం మూడో దశ ఉద్యమం కొనసాగుతోందని, నాలుగో దశ ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. 27వ తేదీన ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించబోతున్నట్లు గుర్తు చేశారు. ఆ సదస్సుకు ఉద్యోగులు అందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉద్యమం చేస్తుంటేనే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని బొప్పరాజు సూచించారు.


ఏపీలో మూడేళ్ల క్రితం కొన్ని డిమాండ్లపై తాము చేసుకున్న ఒప్పందంలో చేర్చిన అంశాలను సర్కారు ఇప్పటికీ పరిష్కరించలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సారీ చాయ్, బిస్కెట్ సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యమ బాట పట్టిన తర్వాతే కారుణ్య నియామకాలు వచ్చాయని, ఉద్యమ ఫలితంగానే పోలీసులకు 525 కోట్ల రూపాయలు సరెండర్ లీవులు ఇచ్చారని గుర్తు చేశారు. తాము ఒప్పందం చేసుకున్న మిగిలిన అంశాలపై ఏపీ సర్కారు నిర్ణయం తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పారు. మిగిలిన డిమాండ్లపై తాము ఏపీ చీఫ్ సెక్రటరీని కలిశామని, ప్రధాన ఆర్థిక డిమాండ్లపై చర్చించాలని కోరామని చెప్పారు. నాలుగు డీఏలు ఇవ్వాలని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. కొత్త పీఆర్సీ రికమండెడ్ పే స్కేళ్లు బయటపెట్టి.. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కూడా బొప్పరాజు డిమాండ్ చేశామని తెలిపారు. 


ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ 27వ మహాసభలు ఈనెల 24న విజయావడలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో 9 వేల మంది మహాసభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు రవాణా శాఖా మంత్రి, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ హాజరు అవుతారని, ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు కూడా ఈ మహాసభలో జరుగుతాయని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఏపీ పీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి వలిశెట్టి దామోదర్ తెలిపారు. మూడో ప్రాంతీయ సదస్సు ఏలూరులో ఈ నెల 27వ తేదీన జరుగుతుందని చెప్పారు. ఉద్యమించకుంటే ప్రతి ఉద్యోగి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే జీతాలు సరైన సమయానికి పడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోయినా బొప్పరాజు మాత్రం పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఉద్యోగుల మలిదశ ఉద్యమం ఓర్పుతో సాగుతోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని స్పష్టం చేశారు.