ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో‌ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా కనిపిస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‌జనసేన పార్టీ నాయకులు రైతుల పక్షాన నిరసన  దీక్షకు దిగారు. సాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల కాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఈ ప్రాంతంలో కుడి కాలువ ఆయకట్టు కింద లక్ష ఎకరాలు వరి పంటను వేశారు. నీరు నిలిచి‌ పోవడంతో పంట‌‌ ఇప్పటికే ఎండిపోయేలా ఉంది. నీరు విడుదల చేయాలని, పంటను కాపాడాలంటూ రైతులు కొంత‌కాలం నుంచి ఆందోళన ‌చేస్తున్నా ప్రభుత్వం, స్థానిక మంత్రి, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ రైతుల‌ తరపున ఆందోళనకు శ్రీకారం చుట్టింది.
మంత్రి అంబటికి వార్నింగ్..
సత్తెనపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జలవనరులు శాఖా మంత్రి అంబటి రాంబాబు రైతు సాగునీటి‌ సమస్యపై స్పందించక పోవడంతో పార్టీ నాయకులు వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం లోపు కుడి కాలువకు సాగర్ నుంచి నీటిని విడుదల‌ చేయించాలని లేకపోతే మంత్రి ఇంటిని ముట్టడిస్తాం అన్నారు. గతంలో సాగర్ కుడి కాలువ నుంచి నీరు ఆగిపోయిందని జనసేన నాయకులు తెలిపితే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఆ విషయాన్ని బేస్ చేసుకొని తన నియోజకవర్గం తన ప్రాంతంలో నదీ, కాలువ ప్రవాహాలపై అవగాహన లేని వ్యక్తి జలవనరులు శాఖ మంత్రి కావడం దురదృష్టం అంటూ జనసేన నాయకులు విమర్శలు గుప్పించారు.


జనసేన నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు అలర్ట్..
గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో నిరసనకు దిగారు. జనసేన పార్టీ కార్యాలయం పక్కన టెంట్లో రైతులతో కలసి ఆందోళన చేపట్టారు. జలవనరుల‌శాఖ మంత్రి అంబటి ఇంటిని ముట్టడిస్తారని ప్రచారం జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో జేఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారినట్లు తెలుస్తోంది.


జనసేన జిల్లా‌ అద్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి అంబటిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి నది గర్బంలో  ఉన్న ఇసుకను దోచుకోవడంలో‌‌ ఉన్న శ్రద్ద నీటిపై లేదన్నారు. సాగర్ జలాశయంలో‌ తగినంత నీరు ఉన్నప్పటికి కుడి కాలవకు నీటిని బంద్ చేయడం దుర్మార్గం అన్నారు. నీటి నిర్వహణపై కనీస‌ అవగావన లేని వ్యక్తి జల వనరుల‌శాఖా మంత్రి కావడం రాష్ట్ర ప్రజల‌ కర్మ అన్నారు. మంత్రి అంబటికి నదీ ప్రవాహాల‌ లెక్కలు తెలియవని ఎద్దేవా చేశారు. 
సత్తెనపల్లి ప్రాంతంలో‌ ఉన్న కొండలలో‌ మైనిగ్ చేయడం, గ్రావెల్ తొవ్వించి దోచేయడం తప్ప మిగతా‌ కార్యక్రమాలు తెలియవని సెటైర్లు వేశారు. తమకు ఓట్లు, రాజకీయాలతో పని లేదని ప్రజాసమస్యలే ప్రధానమని స్పష్టం చేశారు. రైతుల పంట కాపాడేందుకు ఎంతవరకు పోయేందుకు అయినా జనసేన పార్టీ  సిద్ధంగా ఉందన్నారు. పోలీసు కేసులకు బయపడే పరిస్థితి తమది కాదన్నారు. రెండు రోజులలో‌ సాగర్ కుడి కాలవకు నీరు వదలక పోతే మంత్రి అంబటి‌ ఇంటిని ముట్టడిస్తామని, ఆయనను బయట తిరగనిచ్చేది లేదని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.