YS Jagan:  వైసీపీ అధినేత జగన్ ఇంటికి సమీపంలోని రోడ్డుపై ఉన్న ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసింది. ఇకపై ఆక్కడ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఉదయాన్ని రోడ్డుపై ఉన్న బారికేడ్లను పోలీసులు తొలగించారు. రాకపోకలకు మార్గాన్ని సుగుమం చేశారు. 




ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ఉన్న రోడ్డును జగన్ సీఎం అయ్యాక మూసివేయించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడ్డారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం అప్పట్లో సమీపంలోని ఇళ్లను కూడా తొలగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 




రోడ్డు కోసం తొలగించిన ఇళ్లలో ఉన్న వారికి నిధులు చెల్లింపులో కూడా సరిగా వ్యవహరించలేదని ఇదేంటని అడిగిన వారిపై కేసులు కూడా పెట్టారని ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. శివశ్రీ అనే మహిళ ఇంటిని రాత్రికి రాత్రే తొలగించడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఇలా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రోడ్డుపై సామాన్యుల రాకపోకలు నిషేధించారు. సీఎంగా ఉన్న జగన్‌ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందుకే ఆ రోడ్డుపై బారికేడ్లు పెట్టి ప్రజలను రానివ్వలేదు. 




ఇన్నాళ్లూ జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో భారీ కేడ్లతో, ఇనుప కంచెలతో  మూసివేసిన రోడ్లకు ఇప్పుడు విముక్తి లభించింది. పోలీస్ ఆంక్షలతో జగన్ నివాస సమీపంలో పరిసర ప్రాంత ప్రజలు రాకపోకులకు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. నారా లోకేష్ మంత్రి అయ్యాక ఆ ప్రాంత ప్రజలు చాలా మంది వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా ఈ రోడ్డుపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయంతీసుకున్నారు. దీనికి స్థానిక ప్రజలు లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.