2023 మార్చిలో ఏపీలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును విశాఖపట్నంలో నిర్వహిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. గత మూడేళ్ల కాలం నుంచి రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయారని గుర్తు చేశారు. మంగళవారం (నవంబరు 8) మంత్రి గుడివాడ అమర్ నాథ్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.


‘‘గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సును విశాఖపట్నంలో నిర్వహించాలని సీఎం జగన్ చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించి ఈ సదస్సును నిర్వహిస్తాం. గత మూడేళ్ల కాలంలో కరోనా పరిస్థితుల వల్ల ఈ సదస్సులు నిర్వహించలేదు. ఇప్పుడు వాటిని దాటుకుని ముందుకు అడుగులు వేస్తున్నాం. గత మూడేళ్లలో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లు నిర్వహించలేకపోయారు. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు కూడా ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లను నిర్వహించడం ప్రారంభిస్తున్నాయి. ఏపీలో జరిగే ఈ ఇన్వెస్టర్ల సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సమ్మిట్‌కు ఆహ్వానిస్తాం


ఎంఎస్‌ఎంఈలపై కూడా ఫోకస్‌ పెట్టాం. రాష్ట్రంలో పరిశ్రల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నాం. విశాఖపట్నం, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఐదు షిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణం చేస్తున్నాం. రామాయపట్నం పోర్టుకి 2024 జనవరి నాటికి మొదటి షిప్‌ తెచ్చేలా ప్రణాళిక చేస్తున్నాం. దేశానికి ఏపీనే ముఖ ద్వారంగా మారబోయేలా చేస్తున్నాం. ఆర్థికాభివృద్ధిలో మన  రాష్ట్రం కీలక పాత్ర పోషించబోతోంది’ అని తెలిపారు.






మోదీ పర్యటనపై సమీక్ష


విశాఖపట్నంలో ఈ నెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఉన్నందున సోమవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో ముఖ్య నాయకులతో మంత్రి గుడివాడ సమావేశమైయ్యారు. పలువురు నేతలకు ఆయా బాధ్యతలను అప్పగించారు. రెండు రోజుల పర్యటనకు విశాఖ నగరానికి వస్తున్న ప్రధాని మోదీ రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. అలాగే, సుమారు రూ.ఐదువేల కోట్లతో నిర్మించనున్న భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన చేయడానికి అవకాశాలను పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. విశాఖపట్నం వస్తున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అంతా తరలి రావాలని మంత్రి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.