ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కొత్త ఆర్టీవో రూల్స్ తీసుకొస్తుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు సెల్‌ఫోన్ చూస్తూనో మాట్లాడుతూనో జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ అయ్యాయని అందుకే ఏపీ ప్రభుత్వం వీటి నివారణపై దృష్టి పెట్టిందని అంటున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కొందరు డ్రైవింగ్ చేస్తుంటారు. మరికొందరు ఎవరికీ కనిపించకుండా బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొందరు హెడ్‌సెట్ పెట్టుకొని జాయిగా వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఓ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారుతోంది.
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా అంటూ ప్రచారం
డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించబోతోందని ఆ వార్త సారాంశం. ఆగస్టు నెల నుంచి ఇది ప్రారంభం కానుందని కూడా చెబుతున్నారి. ఆంధ్రప్రదేశ్‌లో బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తే 20,000 జరిమానా వేస్తారని పుకార్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే రవాణా శాఖ అధికారులు వెల్లడించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. ఆగస్టు నెల నుంచి అమల్లోకి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేయడంతో కొంత మంది అనుకూలంగా.. కొంత మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిమానాలన్న ఏపీ ప్రభుత్వం
ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కంటెంట్‌పై నిజనిర్దారణ కోసం ఏబీపీ దేశం ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ ప్రచారం వట్టిదేనని ఏపీ రవాణా శాఖ కమిషనర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే రాష్ట్రంలో సవరించిన జరిమానాలు వసూలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.. అయితే, మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ పెట్టుకుని వాహనం నడుపుతూ దొరికిపోతే మొదటిసారి రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.. అంతేకాదు.. ఇలా పదేపదే పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నిబంధనలు.. ఎంతో కాలం నుంచి అమలు చేస్తున్నామని.. జరిమానా పెంపు ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణా శాఖ కమిషనర్.
సోషల్ మీడియా ప్రచారాలతో ఇబ్బంది
సోషల్ మీడియాలో ఉన్నవీ లేనివీ ఇష్టానుసారంగా ప్రచారం చేసేస్తున్నారు. అది ఫేక్ అని తెలిసినా కూడా రాజకీయ కారణాలతో ప్రచారం చేస్తూండటంతో నెటిజన్లు గందరగోళానికి గురవుతున్నారు. నమ్మేవాళ్లు కూడా ఉండటంతో అసలు నిజమేంటో తెలియక గందరగోళం ఏర్పడుతోంది . ప్రభుత్వం వివరణ ఇచ్చినా.. అబద్దం ప్రజల్లోకి వెళ్లినంత వేగంగా.. వాస్తవ వెళ్లడం లేదు.