Atchutapuram AP SEZ Accident: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురంలోని ఏపీ సెజ్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి తగినంత పరిహారం అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


‘‘అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని అచ్యుతాపురం లోని ఫార్మా సెజ్ లో నేటి మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో 16 మంది మరణించారని, మరో 50 మందికి పైగా గాయపడ్డారని తెలిసి చాలా బాధ కలిగింది. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో చోటు చేసుకున్న ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో కార్మికులంతా కాస్త సేదదీరుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


ప్రమాదం జరిగిన వెంటనే ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ నుంచి సమాచారం తెలుసుకున్నాను. అధికారులతో ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకొని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక, వైద్య సహాయాలు అందించాలని సూచించాను. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వారికి తగినంత పరిహారం అందేలా ఎన్.డి.ఏ. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ స్పందించారు.


దిగ్భ్రాంతికి గురి చేసింది - షర్మిల
‘‘అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, చనిపోయిన కుటుంబాలకు తక్షణం పరిహారం ప్రకటించాలని, రియాక్టర్ పేలుడు ఘటన పై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని కూటమి సర్కార్ ను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.