Jogi Ramesh in Mangalagiri DSP Office: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ హాయాంలో దాడి చేసిన ఘటనలో నేడు (ఆగస్టు 21) మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఫోన్, సిమ్ కార్డులను తమకు ఇవ్వాలనే విషయంలో నిన్న తన లాయర్లను జోగి రమేష్ పంపారు. వారు ఇచ్చిన సెక్షన్ లకు సంతృప్తి చెందని పోలీసులు.. మళ్ళీ పలు సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయానికి మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్, మాజీ ఏపీ ఫైబర్ చైర్మన్ పూనురు గౌతం రెడ్డి, జోగి రమేష్ లాయర్ శర్మలతో పాటు పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ మురళి కృష్ణ, రూరల్ సీఐ శ్రీనివాసరావు సమక్షంలో విచారణ చేయనున్నారు.
మంగళవారమే జోగి రమేశ్ హాజరు కావాల్సి ఉంది. అయితే, పోలీసులు ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తానని ఆయన కోర్టుకు చెప్పి బెయిల్ పొందారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని.. దాడి జరిగిన రోజు వాడిన సెల్‌ఫోన్‌తో పాటు ఇప్పుడు వాడుతున్న సెల్‌ఫోన్, సిమ్ కార్డులను తమకు అప్పగించాలని డీఎస్పీ మురళీకృష్ణ జోగికి నోటీసు పంపారు. మధ్యాహ్నం 2 - 4 గంటల మధ్య వస్తానని చెప్పిన జోగి రమేష్.. తాను వెళ్లకుండా తన న్యాయవాదులను పంపారు. 2021లో వాడిన ఫోన్ ను తాను మార్చేశానని, సిమ్ కార్డు అప్పటిదే వాడుతున్నానని తెలిపారు. ఫోన్, సిమ్ కార్డుతో తనకు పని ఉన్నందున వాటిని అప్పగించలేనని తన లాయర్ల ద్వారా సమాచారం పంపారు.
ఈ మేరకు జోగి రమేష్ లాయర్లు వెంకటేష్ శర్మ, ఆదాం, గవాస్కర్‌లు డీఎస్పీ మురళీ కృష్ణను కలిసి నోటీసుకు సంబంధించి జోగి రమేశ్ సమాధానం లెటర్ ను అందజేశారు. దీంతో సంతృప్తి చెందని పోలీసులు.. బుధవారం మళ్లీ నోటీసులు పంపారు. దీంతో బుధవారం డీఎస్పీ ఆఫీసులో జోగి రమేశ్ హాజరయ్యారు.