Chandrababu Open Letter: తెలుగు దేశం పార్టీ గుర్తు అయిన సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమానికి, మరొకటి అభివృద్ధికి ప్రతీక అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’పై రేపటి నుంచి ప్రచారం కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు. దాదాపు 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు.. రాష్ట్ర ప్రజలందరినీ కలిసే ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కావాలని కోరారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను.. వైసీపీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు. కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లేవని, మహిళలకు సాధికారత కల్పించలేదని వివరించారు. అసలు స్త్రీలకు రాష్ట్రంలో భద్రతే లేదని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ముఖ్యంగా నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలపై ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో పథకాలను ప్రకటించామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 


సెప్టెంబరు 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యకర్తలు, నేతలు రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆర్థిక స్థితి, రక్షణ, భవిష్యత్తు కోసం రూపొందించిన సూపర్స్ సిక్స్ పథకాల గురించి వివరించబోతున్నట్లు తెలిపారు. అలాగే వీటి వల్ల కలిగే లాభాలను కూడా తెలపబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ సమస్యలు, కష్టాలను పార్టీ నేతలతో చెప్పుకోవాలని అన్నారు. అలాగే ఆయా పథకాల అమలుకు సంబంధించి తన సంతకంతో కూడిన హామీ పత్రాన్ని ప్రజలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రజలందరి భాగస్వామ్యం, మద్దతు చాలా అవసరం అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.