మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సీఐడీ విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీఐడీ విచారణ కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున లాయర్లు సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో ఉన్న కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. 


స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లోని కోర్టుల్లో వరుస షాక్‌లు తగిలాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టుల్లో చంద్రబాబుకు ఊరట లభించ లేదు. సీఐడీ పిటిషన్‌తో చంద్రబాబుకు రెండు రోజుల పాటు కస్టడీకి విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతింది. ఇక ఈ కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. 


ఇకపై ఈ కేసులపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని చంద్రబాబు టీం నిర్ణయానికి వచ్చింది. నిన్నటి నుంచి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇవాళ సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ ఫైల్‌ చేశారు. నిన్న హైకోర్టులో పిటిషన్‌ కొట్టివేసిన తర్వాత టీడీపీ లీగల్ టీమ్ చంద్రబాబుతో చర్చించింది. చంద్రబాబుతో న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. సీఐడీ కస్టడీ, క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన అంశాలను చంద్రబాబుకు వివరించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై బాబుతో చర్చించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలోని అంశాలను టీడీపీ లీగల్ టీమ్ అధ్యయనం చేసి సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. 


చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను సోమవారం సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేంతవరకు ఢిల్లీలోనే లోకేష్ ఉండనున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. 


సుదీర్ఘ వాదనల తర్వాత  హైకోర్టు చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టిసిన హైకోర్టు తీర్పుకాపీలో చాలా ఆంశాలపై క్లారిటీ ఇచ్చింది. సెక్షన్‌ 482 సీఆర్‌పీసీకీ సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని పేర్కొంది. నిహారిక ఇన్‌ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును న్యాయమూర్తి ఉదహరించారు. ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్‌ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్‌ నిర్వహించలేమని స్పష్టం చేసింది. 2021 నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను సీఐడీ విచారించిందని తెలిపింది. దాదాపు 4వేల డాక్యుమెంట్‌ ఆధారాలను పరిశీలనలోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిందని కోర్టు భావిస్తోందన్నారు. ఈ కేసును క్వాష్‌ పేరిట నిలిపివేయలేమని... దర్యాప్తును నిలువరించలేమని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేమని... దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు డిస్మిష్ చేస్తున్నట్టు తీర్పు చెప్పింది. 


ప్రస్తుతం చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో సిఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి విచారణ సాగుతోంది. గంటకోసారి ఐదు నిమిషాల గ్యాప్ ఇస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ విచారణ ఆదివారం కూడా జరగనుంది.