Amaravathi Outer Ring Roads: ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) తొలి ఢిల్లీ పర్యటనలోనే పలు కీలక ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. అమరావతి(Amaravati) నిర్మాణమే ప్రథమ లక్ష్యంమని తెలిసిన చంద్రబాబు...అందుకు తగ్గట్లుగానే రాజధాని అభివృద్ధికి అవసరమైన పలు కీలక ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకున్నారు. రాజధానికి గుండెకాయలాంటి ఔటర్‌రింగ్‌రోడ్డు(Outer Ring Road) నిర్మాణంతోపాటు, అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే పొడిగింపు, హైదరాబాద్‌- అమరావతి మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం..విజయవాడ(Vijayawada) తూర్పు బైపాస్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది.


అమరావతి పరుగులు
అమరావతి(Amaravati) నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం..అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా తొలి ఢిల్లీ(Delhi) పర్యటనలో చంద్రబాబు(Chandra Babu) రెండురోజులుపాటు వివిధ కేంద్రమంత్రులను కలిశారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్ట్‌కు సహకరించాల్సిందిగా కోరారు. అందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ(Nitin Gadkari)ని కలిసిన ఆయన...పలు కీలక కీలక ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెచ్చుకున్నారు. అమరావతిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు అనుసంధానించే ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఆమోదించింది. అమరావతి(Amaravati)- హైదరాబాద్(Hyderabad) మధ్య ఉన్న ప్రస్తుత జాతీయరహదారిని ఆరు వరుసలకు విస్తరించడంతోపాటు...మరో ఆరువరుసలతో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. దీనివల్ల రెండు నగరాల మధ్య దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.


అమరావతి చుట్టూ అవుటర్‌..
అమరావతి నగరం చుట్టూ అవుటర్‌రింగ్‌రోడ్డు (Outer Ring Road)నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను అనుసంధానిస్తూ 189 కిలోమీటర్ల పొడవైన అవుటర్‌రింగ్‌రోడ్డు నిర్మించనున్నారు. గతంలో తెలుగుదేశం(Telugu Desam) అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కగా...జగన్ వచ్చిన తర్వాత అమరావతిని పట్టించుకోకపోవడంతో పక్కనపెట్టేశారు. మళ్లీ చంద్రబాబు (Chandrababu)ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం ముందు  ఉంచారు. గతంలో ప్రాథమిక అంచనాల ప్రకారం అమరావతి చుట్టూ అవుటర్‌రింగ్‌రోడ్డు నిర్మాణానికి దాదాపు 18వేల కోట్లు వ్యయం కానుండగా... ఖర్చు మొత్తం కేంద్రం భరించేందుకు ముందుకు వచ్చింది. కాకపోతే భూసేకరణకు అవసరమైన నాలుగున్నరవేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని మెలికపెట్టింది. దీనికి అప్పటి ప్రభుత్వం అంగీకరించడంతో కొంతమేర ఈ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లింది. ఇప్పుడు పెరిగిన వ్యయంతోపాటు భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేలా చంద్రబాబు నితిన్‌గ‌డ్కరీని ఒప్పించారు. పెరిగిన వ్యయం, భూసేకరణ కలిపి మొత్తం 25వేల కోట్లను కేంద్రమే పూర్తిగా భరించనుంది. త్వరలోనే భూసేకరణ చేపట్టి...పనులు ప్రారంభించనున్నారు. ఆరు వరుస యాక్సెస్ కంట్రోల్ ఎక్స్‌ప్రెస్‌వేగా ఈ రోడ్డు నిర్మించనున్నారు. రెండు పక్కలా సర్వీస్‌ రోడ్లు రానున్నాయి. 


ఇన్నర్‌రింగ్‌రోడ్డు లేనట్లే
తెలుగుదేశం హయాంలో అమరావతి చుట్టూ అవుటర్‌రింగ్‌రోడ్డుతోపాటు ఇన్నర్‌రింగ్‌రోడ్డు( Inner Ring Road) నిర్మించాలని ప్రతిపాదించారు. డీపీఆర్‌ సైతం సిద్ధం చేసి పనులు ప్రారంభించే సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్...దీన్ని పక్కనపెట్టేశారు. దీనిస్థానంలో విజయవాడ(Vijayawada) పశ్చిమ బైపాస్‌ నిర్మాణం చేపట్టారు. ఇది విజయవాడకు పశ్చిమంగా చైన్నై-కోల్‌కత్త జాతీయరహదారి పై చిన్నఅవుట్‌పల్లి నుంచి మొదలై అమరావతి మీదుగా కాజా వరకు 47.8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. దీంతో ఇన్నర్‌రింగ్‌ నిర్మాణ ప్రతిపాదనను చంద్రబాబు విరమించుకున్నారు. దీనిస్థానంలో విజయవాడకు తూర్పువైపు మరో బైపాస్‌రోడ్డు నిర్మించాలని కోరగా...కేంద్రం అంగీకరించింది. సుమారు 49 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం పూర్తయితే...ఇది అమరావతికి ఇన్నర్‌రింగ్‌రోడ్డు మాదిరిగానే ఉండనుంది. 


అమరావతి టు రాయలసీమ
గతంలో తెలుగుదేశం ప్రభుత్వహయాంలో రాయలసీమ జిల్లాల నుంచి అమరావతికి నేరుగా అనుసంధానించేలా అమరావతి(Amaravati)- అనంతపురం (Ananthapur) ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడా మలుపులు లేకుండా నేరుగా ఉండేలా ప్రతిపాదించారు. దీనికి భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభించే సమయంలో జగన్‌ అధికారంలోకి రావడంతో....ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా మార్చేశారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల(Pulivendhula)ను అనుసంధానించేలా మార్పులు, చేర్పులు చేశారు. అమరావతి(Amaravati) వరకు రోడ్డు అవసరమేలేదంటూ సత్యసాయిజిల్లా కొడికొండ నుంచి మేదరమెట్లవరకే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే టెండర్లు పూర్తయి...పనులు ప్రారంభమవ్వడంతో చంద్రబాబు ఈరోడ్డు నిర్మాణానికి ఏమాత్రం కదిలించకూడదని నిర్ణయించారు. కాకపోతే మేదరమెట్ల  వరకు నిర్మించే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానిస్తూ....మేదరమెట్ల- అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను నిర్మించాలని ప్రతిపాదించగా....కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో అమరావతితో రాయలసీమ జిల్లాలు నేరుగా అనుసంధానించడం జరుగుంది. దీనివల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు నెల్లూరు,ప్రకాశం జిల్లాల నుంచి వచ్చే వారు నేరుగా అమరావతి చేరుకోవచ్చు. 


అమరావతి-హైదరాబాద్ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే
విజయవాడ- హైదరాబాద్‌ మధ్య పెరిగిన వాహనాల రద్దీ దృష్ట్యా ఇప్పుడు ఉన్న జాతీయ రహదారిని ఆరువరుసలకు విస్తరించడమే గాక....అమరావతి-హైదరాబాద్‌ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి  కేంద్రం ఆమోదం తెలిపింది. దీనివల్ల రెండు నగరాల మధ్య దూరం సుమారు 70 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం 20కి పైగా ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తుండటంతో హైదరాబాద్- అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని చంద్రబాబు కోరారు. పైగా విభజనచట్టంలోనూ ఈ హామీ ఉంది.