Andhra Pradesh News | ఏపీ రాజకీయం వరదల నుంచి మెల్లిగా మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్ల వ్యవహారం వైపు టర్న్ తీసుకుంది. మెడికల్ సీట్లు వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(NMC)కు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇదే వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. వైద్య విద్యా విధానంలో వైసీపీ తీసుకొచ్చిన సంస్కరణలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు.
జగన్ ఘాటు ట్వీట్..
రాష్ట్రానికి MBBS సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం అని అన్నారు జగన్. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం అంటూ మండిపడ్డారు. కొత్త మెడికల్ కాలేజీలు, MBBS సీట్లకోసం పక్క రాష్ట్రాలు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తరుణంలో.. మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపించడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని నిలదీశారు. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజల హక్కు అని, వాటిని ప్రజలకు అందించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు జగన్. ఆ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ మెడికల్ కాలేజీ లక్ష్యంగా తమ ప్రభుత్వ హయాంలో 17 కాలేజీల నిర్మాణం మొదలు పెట్టామని, గత విద్యా సంవత్సరం 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభించామని, దానివల్ల అదనంగా 750 సీట్లు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు జగన్. కొత్త ప్రభుత్వం కూడా తమలాగే కృషి చేసి ఉంటే మరో 750 సీట్లు ఈ ఏడాది వచ్చేవని, కానీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే కుట్రతో సీట్లు వద్దంటూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని అన్నారు. కొవిడ్ సంక్షోభంలో కూడా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలకోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు మెడికల్ సీట్లన్నీ ఫ్రీ అని కూటమి నేతలు చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక కాలేజీలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఇకనైనా చంద్రబాబు కళ్లుతెరిచి.. NMCకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. "మీకు చేతకాకపోతే చెప్పండి, మేం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తా"మంటూ ఘాటు ట్వీట్ వేశారు జగన్.
టీడీపీ కౌంటర్..
మొత్తం 8 పాయింట్లతో జగన్ వేసిన ట్వీట్ కి టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. "బెంగళూరు నుంచి ట్వీట్ వేసిన పులివెందుల ఎమ్మెల్యే గారికి... ఇదే మా సమాధానం" అంటూ వెటకారం చేసింది. ప్రతి నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ ఉండాలనేది కేంద్రంలోని NDA ప్రభుత్వ విధానం అని, ఆ విషయంలో జగన్ బిల్డప్ లు ఆపాలని కౌంటర్ ఇచ్చింది. పక్క రాష్ట్రం తెలంగాణ 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, అవినాష్ రెడ్డి బెయిల్ కోసం సాగిలపడి కేవలం 5 మెడికల్ కాలేజీలు చాలు అని చెప్పి జగన్, రాష్ట్రానికి శాపంగా మారారాని ట్విట్టర్లో బదులిచ్చింది టీడీపీ.
Also Read: ముంబై నటి జత్వానీ కేసు - ముగ్గురు ఐపీఎస్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు
17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.8,480 కోట్లు అవసరం అయితే, జగన్ కేవలం రూ.1,451 కోట్లు ఖర్చు పెట్టారని, మిగతా డబ్బులు దారి మళ్లించారని టీడీపీ ఆరోపించింది. అసలు బిల్డింగులే లేకపోతే, అనుమతులు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నించింది. వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం మాత్రమే ప్రారంభమైందని, భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. జగన్ అసమర్ధ, చేతకాని, దద్దమ్మ పాలన వల్లే, 5 మెడికల్ కాలేజీలకి NMC అనుమతి నిరాకరించిందని గుర్తు చేసింది. ఇక పులివెందుల కాలేజీ కోసం కనీసం లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా జగన్ తీసుకోలేదని ఎద్దేవా చేసింది. భవనాలు లేకపోవడం, బోధన సిబ్బంది కొరత ఉండటంతో NMC ప్రవేశాలకు అనుమతి నిరాకరించిందని క్లారిటీ ఇచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంలో వైద్య రంగానికి 4శాతం బడ్జెట్ కేటాయిస్తే దాన్ని 1శాతానికి వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని టీడీపీ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చింది.
Also Read: YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్